Padi Kaushik Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ బట్టలు విప్పుతాం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగొట్టిండు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే.. నేను సంజయ్ మీద దాడి చేయలేదు అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వాస్తవానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టానని కౌశిక్ రెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టలేదు. పదే పదే నేను కొన్ని మీడియా, యూట్యూబ్ చానెల్స్‌లో చూస్తున్నా.. యావత్ తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద దాడి చేసిండు అని ప్రసారం చేస్తున్నారు. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే.. నేను సంజయ్ మీద దాడి చేయలేదు. నా పక్కన కూర్చొని బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్ల విప్పుతారో చూడు అన్నాడు.. అన్న తర్వాత ఆయనకు మైక్ ఇచ్చారు. దాంతో ఏ పార్టీ తరపున మైక్ ఇచ్చారు..? అని అడిగాను. దాంతో నా ఛాతి మీద చేయి పెట్టి దాడి చేశారు. డాక్టర్ సంజయ్ మాదిరిగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వేలుపెట్టి బెదిరించారు. ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పోలీసులు దాడి చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారు. మానకొండూరు ఎమ్మెల్యే నా గల్లా పట్టుకుని గుంజారు. మక్కాన్ సింగ్ ఠాకూర్ నా పాయింట్లో చేయి పెట్టి గుంజారు. శ్రీధర్ బాబు ఆదేశాలతో పోలీసులు నెట్టేశారు.. కింద పడిపోయాను అని వీడియో ఆధారాలతో కౌశిక్ రెడ్డి తెలిపారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు రివ్యూ మీటింగ్‌కు వెళ్లాను. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా నేను వెళ్లాను. ప్రభుత్వ హామీలను అడిగాను. అసలు రైతు భరోసా 100 రోజుల్లో ఇస్తామన్నారు. కేసీఆర్ 10 వేలు ఇస్తుండు.. నేను 15 వేలు ఇస్తా అని రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల్లో పెట్టారు. 14 నెలలు అవుతుంటే ఒక్క రూపాయి కూడా రౌతుల అకౌంట్లలో వేయలేదని అడిగాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వంద శాతం రుణమాఫీ చేశాను అని చెబుతున్నారు. నా నియోజకవర్గంలో 50 శాతం మంది రైతులకే రుణమాఫీ అయింది.. ఇవి రెండు కచ్చితంగా చేయండని నా నియోజకవర్గం, తెలంగాణ రైతుల పక్షాన అడిగాను… ఇందులో తప్పేముంది..? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ మొదలుపెట్టారు. శాచురేషన్ మోడ్‌లో 18500 కుటుంబాలకు ఇచ్చారు. లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. 13 వేల మంది దాకా 100 శాతం డబ్బులు తీసుకున్నారు. 5500 మంది వరకు రెండో విడత రీలిజ్ చేయాలని అడిగాను. ఇవి అడుగుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్ చేశారు. ఇది వేదిక కాదు అని మాట్లాడారు. దళిత బంధు కింద 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. వీటిని ప్రశ్నిస్తే వారికి మింగుడు పడలేదు. ఇవన్నీ అడుగుతుంటే నా మీద దాడి చేయాలని గలీజ్ ఆలోచనతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దాడి చేయించారు అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
సంజయ్ గెలిచింది.. పోటీ చేసింది.. ఏ పార్టీ నుంచి.. కేసీఆర్ బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతోనే జగిత్యాలలో గెలిచిండు. బట్టలు చింపుతామని నన్ను రెచ్చగొట్టిండు. ఏ పార్టీలో గెలిచావు అని ప్రశ్నిస్తే.. బాజప్తా కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు.. స్పీకర్‌ను కోరుతున్నా.. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నా.. సంజయ్‌ను డిస్ క్వాలిఫై చేయాలి. సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్‌ను కోరిండు.. నేను హుజురాబాద్ ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేను అయ్యాను. నేను పార్టీ మారలేదు. కేసీఆర్ బొమ్మతోనే గెలిచాను. ప్రజల పక్షాన కొట్లాడుతున్నాను.. సంజయ్ లాగా పైసలకు అమ్ముడు పోలేదు. డాక్టర్ సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ డిస్ క్వాలిఫై చేయాలి. ముగ్గురు మంత్రుల సమక్షంలో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు డిస్ క్వాలిఫై చేయట్లేదు అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై కాంగ్రెస్ నేతల అబద్ధపు ప్రచారం.. మండిపడ్డ బీఆర్ఎస్
Manchu Manoj | మోహన్‌బాబు వర్సిటీ వద్ద మళ్లీ ఉద్రిక్తత.. ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్ద నివాళి
Cycling Track | వట్టినాగులపల్లి వద్ద సైకిల్ ట్రాక్‌కు పగుళ్లు..!