KTR | రాజన్న సిరిసిల్ల : హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంతో పాటు ఇతర వేదికల ద్వారా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. చాలా మంది నాయకులు స్పష్టంగా చెప్పారు. ఫార్మా సిటీని రద్దు చేసి ఆ భూములను తిరిగి రెతులకు ఇచ్చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఫార్మా సిటీ రద్దు అని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటనలు చేశారు. అయితే ఫార్మా సిటీ ఉన్నదా..? పోయిందా..? అని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ రద్దు కాలేదు.. అట్లనే ఉందని నిన్న హైకోర్టులో పిటిషన్ వేసింది. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే సూటిగా అడుగుతున్నా.. సీఎం ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడడం లేదు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ అని మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పు చేతనైతే.. నీ భాషలో చెప్పాలంటే మొగోడివి అయితే చెప్పు.. నీవు చెప్పే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ కోసం ఒక్క ఎకరమైనా భూసేకరణ చట్టం కింద సేకరించావా..? మీరు ఒక్క ఎకరం భూమి సేకరించకపోతే, మేం గతంలో ప్రతిపాదించిన ఫార్మా సిటీ భూమే అయితే దాన్ని ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తావు..? చివరకు న్యాయమూర్తులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నావు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.
నువ్వు గతంలో చెప్పిన మాట ప్రకారం.. ఫార్మా సిటీని రద్దు చేసిన మాట నిజమే అయితే.. ఆ భూములను రైతులకు తిరిగిచ్చే పని చేయ్. అలా కాకుండా ఫోర్త్ సిటీ కడుతా.. ఫిప్త్ సిటీ కడుతా.. మా ఫోర్ బ్రదర్స్‌కు రియల్ ఎస్టేట్ దందాకు వాడుతా అంటే రైతులు ఊరుకోరు. ఏ రైతులైతే నీకు ఓటేశారు.. వారే నీ పార్టీ అంతు చూస్తారు. రేపు ప్రభుత్వం కోర్టులో స్పష్టంగా చెప్పాలి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మా సిటీ కడుతున్నారా..? లేదా..? అదే విధంగా కోర్టు కూడా నోటీసు చేయాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఫార్మా సిటీ కోసం ఏడేండ్లు కష్టపడి రైతులను ఒప్పించి, మెప్పించి.. నానా తంటాలు పడి సేకరించిన 14 వేల ఎకరాల్లో 64 వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అకాశాలు రావాలని ఫార్మాసిటీని ప్రతిపాదించామని కేటీఆర్ తెలిపారు.
ఫార్మా సిటీ కోసం ఆనాడు సేకరించిన 14 వేల ఎకరాలు కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్నాము. అంటే ఫార్మా సిటీ కోసమే మేము తీసుకుంటున్నాము అని స్పష్టంగా జీవోలో పేర్కుంటూ ఫార్మా సిటీ కోసం భూములను తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం, ఏఐ సిటీ అనే హడావుడి కోసం మళ్లించి దాంట్లో నుండి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పక్కా రియల్ ఎస్టేట్ స్కాం.. దీన్ని న్యాయమూర్తులు గమనించాలని కోరుతున్నాను. భూ దందాలను తప్పకుండా బయటపెడుతాం. ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ఫార్మా సిటీని కొనసాగిస్తే 14 వేల ఎకరాల్లో ఉండాలి లేదా రద్దు చేస్తే ఆ భూమి రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | శిక్ష తప్పదు.. రిటైర్ అయినా రికవరీ చేయిస్తా.. అధికారులను హెచ్చరించిన కేటీఆర్
KTR | నా మీద కోపంతో.. నేతన్నల మీద కక్ష తీర్చుకుంటున్నాడు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్