Harish Rao | సంగారెడ్డి : ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వ్యవసాయ కూలీలందరికి వర్తింపజేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే గ్రామాల్లో కూలీలు తిరగబడుతారు.. తస్మాత్ జాగ్రత్త అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం కింద వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి చొప్పున 12 వేలు ఇస్తామన్నారు. ఉపాధి హామీ పనిలో మట్టి పనులకు పోయే వారిని వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తామన్నారు. మన రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డుల కింద.. కోటి 2 లక్షల మంది మట్టి పనికి వెళ్తున్నారు. ఒక్క సెంట్ భూమి ఉన్నా.. వారు కూలీ కాదు అని నిబంధన పెట్టారు. ఉపాధి హామీ కింద ఈ ఏడాది 20 రోజులు పని చేసి ఉంటేనే కూలీ అని గుర్తిస్తామన్నారు. సెంటు భూమిలో ఏమైనా పండుతదా..? ఆ సెంటు భూమిలో వ్యవసాయం చేసుకుని దళితుడు, గిరిజనుడు బతుకుతాడా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 24 లక్షల 57 వేల మంది రైతులు ఉన్నారు. ఇందులో దళితులు, గిరిజనులు, బీసీలు ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే దళిత గిరిజన రైతులకు శఠగోపం పెట్టడమేనా..? వాళ్ల నోరు నొక్కడమేనా..? ఈ పథకాన్ని వారికి వర్తింపజేయొద్దని, వారి నోర్లు నొక్కాలని మీకు చేతులు ఎలా వచ్చాయి..? కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. ప్రభుత్వం నిజాయితీగా ఆలోచించి.. ఎకరం లోపు ఉన్న రైతులకు మేలు చేయాలి. నీకు ఇష్టం లేకపోతే పథకం బంద్ చేయ్.. తప్పయిందని క్షమాపణ చెప్పు. వ్యవసాయ కూలీలను మోసం చేయొద్దు. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకు కోత పెట్టడం అవసరమా..? వ్యవసాయ కూలీల పక్షాన కోరుతున్నాను.. ఉపాధి హామీలో మట్టి పనికి వెళ్లే కూలీకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయండి. గ్రామ సభలు పెడితే తిరగబడుతారని హెచ్చరిస్తున్నా.. కూలీలు తిరగబడుతారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా.. ఆకలి ఉంది కాబట్టి కడుపు నింపుకోవడానికి కూలీకి పోతున్నారు.. ఎకరం లోపు భూములు ఉన్నవారందరిని వ్యవసాయ కూలీలుగా గుర్తించి ఈ పథకం కింద లబ్ది చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Rasamayi | దమ్ముంటే ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేయాలి : రసమయి బాలకిషన్
Nizamabad | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు