Harish Rao | సంగారెడ్డి : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో డమ్మీ హామీలిచ్చినట్టు.. ఏమైనా డమ్మీ చెక్ ఇచ్చావా..? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు.
భోగభాగ్యాలను అందించే భోగి పండుగ, కొత్తకాంతులను తెచ్చే సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్.. రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తోంది. అడుగడుగునా మోసం చేస్తోంది. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడపదాటడం లేదు అని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.
రైతు రుణమాఫీ గురించి పాలమూరు జిల్లాలో రెండు నెలల కిందట సీఎం రేవంత్ రెడ్డి రూ. 2 వేల 750 కోట్ల రుణమాఫీ విడుదల చేసినట్టు చెక్ ఇచ్చారు. ఇవాళ్టికి కూడా సంగారెడ్డికి డబ్బులు రాలేదు. ఇంతకుముందే మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా రైతులతో మాట్లాడాను. ఎక్కడ కూడా ఒక్క రూపాయి డబ్బు పడలేదని రైతులు చెప్పారు. సీఎం ఇచ్చిన చెక్కు విలువ లేదా..? అసలు ఏమన్న గౌరవం ఉందా ఈ ప్రభుత్వానికి. నవంబర్ 30న చెక్ ఇచ్చారు.ఈ రోజుకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. నువ్వు ఏమైనా డమ్మీ చెక్ ఇచ్చావా..? ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టు..? నీవు ఇచ్చిన చెక్ ఎందుకు పాసైతలేదు. దీనిమీద స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారులు తప్పు చేస్తే చర్య తీసుకోండి. చెక్ బౌన్స్ అయిందా..? లేదా చెక్ దారి తప్పిపోయిందా..? ఎందుకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడటం లేదు. అందరికీ రుణమాఫీ అని కొంతమందికే పరిమితం చేశారు. రూ. 2 లక్షల కంటే ఎక్కవ ఉన్న వారు అప్పులు తెచ్చి కడితే కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. బోనస్ బోగస్‌గా మారింది. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని దగా చేశారని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రైతు భరోసా రూ. 15 వేలు అని చెప్పి రూ. 12 వేలు ఇస్తూ దగా చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పకనే చెబుతున్నారు. ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపి.. ఎన్నికలయ్యాక మొడి చేయి చూపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఊరేళ్తే రైతులతో మాట్లాడి.. కాంగ్రెస్ సర్కార్ మోసాలను చెప్పండి. రుణమాఫీ బాధలు, బోనస్ మాటలు, పంటల బీమా గురించి మాట్లాడండి. కేసీఆర్ పాలనలో రైతులను కాపాడుకున్నారు.. రేవంత్ 13 నెలలో ఎలా మోసం చేశారో చెప్పండి రైతులకు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. రైతులను రేవంత్ రెడ్డి మోసం చేసిన తీరుపై చర్చ పెట్టండి. అయితే ఎగవేతలు.. లేదంటే కోతలు.. ఈ విధంగా రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. రైతుల కష్టాలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వండి.. కాంగ్రెస్ మీద పోరాటానికి సన్నద్ధం కావాలి. ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాలను అమలు చేసేలా పోరాటం చేయాలని హరీశ్‌రావు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు
Fertilizers | తెలంగాణలో మళ్లీ మొదలైన ఎరువుల కోసం బారులు
Adiabad | రైతు భరోసా రూ.15,000 ఇవ్వాలని బీఆర్ఎస్ నిరసన