Harish Rao | హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు.. శాసనసభ కాలపరిమితిని కూడా ప్రభుత్వం ఎత్తేస్తుందంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం నాలుగు రోజుల్లో ముగించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బడ్జెట్‌పై 4 నుంచి 8 రోజుల వరకు మాట్లాడిన సందర్భాలున్నాయి. మొత్తం పద్దులపై రెండు రోజుల్లో చర్చ జరగాలట. 15 డిమాండ్లపై ఒక్క రోజులోనే చర్చ పూర్తి చేయాలట. బడ్జెట్ మీద కూడా ఒకే రోజు చర్చ చేపట్టి, అదే రోజు సమాధానం ఇస్తారట. ఎన్నికల హామీలపై శాసనసభలో కూడా చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 రోజులు, 12 రోజులేనా సభ అని మాట్లాడారు. ఇప్పుడేమో నాలుగు రోజులకు కుదించేస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన 15 రోజులు జరపాలని డిమాండ్ చేశాం. 9 ప్రధాన అంశాలు ప్రభుత్వం ముందు పెట్టాం. రేపు నిరుద్యోగుల సమస్యలపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశాం. జాబ్ క్యాలెండర్, గ్రూప్ -2, 3 పోస్టులు పెంచాలని, వీటిపై చర్చ పెట్టాలని స్పీకర్ ముందు ప్రతిపాదన పెట్టాం. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతీయువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నిరుద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరుద్యోగు సమస్యలపైనే చర్చ చేపట్టాలని మేం గట్టిగా డిమాండ్ చేశాం. ఇదే విషయాన్ని మొన్న గవర్నర్‌కు కూడా చెప్పామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
శాంతి భద్రత నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మర్డర్లు, అత్యాచారాలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగాయి. గత పదేండ్లు రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ బాగుండే. ఈ ఏడు నెలల కాలంలో మాత్రం భయపడే పరిస్థితితులు వచ్చాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వీరి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాం. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో ఆంక్షలు పెట్టారు. లక్ష లోపు ఉన్నవారికి చాలా మందికి మాఫీ జరగలేదు. డిసెంబర్ 9 వరకు మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు వడ్డీ రైతులనే కట్టుకోవాలని బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఒకరికి ఉద్యోగం ఉందని, మరొకరికి రేషన్ కార్డు లేదని రుణమాఫీ ఆగిపోయింది. దీనిపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశాం. పంటలకు బోనస్ విషయంలో, రైతు భరోసాపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశాం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై చర్చ చేపట్టాలి. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులన్నీ అర్థాంతరంగా ఆపేశారు. మన ఊరు మన బడి కార్యక్రమాలను ఆపేశారు. పెండింగ్ బిల్లులు త్వరగా మంజూరు చేయాలని కోరామని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
KTR | కేంద్ర బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం : కేటీఆర్
Vinod Kumar | మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోసం : వినోద్ కుమార్