Tatikonda Rajaiah | హనుమకొండ : శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆర్టికల్ 14 ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే ముందు తెలంగాణలో వర్గీకరణ చేస్తామని, ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని మాయమాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి పాత రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుండడంతో మాదిగలు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వడంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని అన్నారు. సీఎం రెండునాలుకల ధోరణితో మాలలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ మాదిగ, మాలల మధ్య దుమారం లేపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపితే నాడు బీజేపీ తాత్సారం చేసిందని తెలిపారు. కుల గణన ఆధారంగా మా వాటా మాకు ఇవ్వాలని రాజయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి 1994 నుంచి నేటి వరకు దళితుల హక్కులు దోచుకుంటున్నాడని, మాదిగలకు చేసింది శూన్యం అన్నారు. మాదిగల అస్థిత్వం కోసం దండోరా ఉద్యమంలో ఉన్న తనకు అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. మాదిగలను ఎన్కౌంటర్ చేయించడంతోపాటు, దండోరా ఉద్యమంలో పాల్గొన్నవారిపై కేసులు పెట్టించి దండోరా నేతలను చీల్చిన చరిత్ర కడియంది అని రాజయ్య మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
OU EMRC | ఓయూ ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు
Osmania University | ఓయూ పరిధిలో ఎంఎంఎస్ పరీక్షా ఫీజు స్వీకరణ
KTR | ఢిల్లీకి అందే మూటల మీద ఉన్న శ్రద్ధ.. మీరిచ్చిన మాట మీద లేదా.. రాహుల్‌గాంధీని నిలదీసిన కేటీఆర్