RS Praveen Kumar | హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా, ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో ఏసీబీ చేర్చింది. ఈ కేసు వ్యవహారంపై మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్ధిక నేరాలను పరిశోధించాను. అదే అనుభవంతో ఇప్పుడే
కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన FIR 14/2024 లోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (worst) కేసు ఇంకొకటి ఉండదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గమ్మత్తేందంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీచే ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడ కూడా సదరు రూ. 55 కోట్ల నుండి ‘ఒక్క పైసా’ కూడా ‘కేటీఆర్ జేబుల్లోకి’ వెళ్లినట్టు నిరూపించలేక పోయారు. పాపం ఆరు నెలలు శ్రమించారు కదా..! ప్రజలు మీకిచ్చిన విలువైన సమయాన్ని నీళ్ల పాలు చేశారు. ఆ మాటకొస్తే ఐఏఎస్ అరవింద్ కుమార్, ఛీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిల మీద కూడా అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో నిరూపించలేక పోయారు. మీరు చూపించగలిగిందంతా ప్రొసీజర్ వయోలేషన్స్ మాత్రమే. వీటికి శాఖా పరమైన ఎంక్వైరీ వేసి నిజమేందో తెలుసుకుంటే సరిపోయేది. అది ఇప్పటికే జరిగింది. సచివాలయంలో ఇలాంటి ప్రోసీజర్ వయోలేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో రోజూ జరుగుతుంటయి. అట్ల చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదు. ప్రజలు ఇబ్బంది పడతారు. ఇలాంటి వయోలేషన్స్ను తరువాత కేబినెట్లో పెట్టి క్రమబద్ధీకరిస్తారు. వీటి మీద స్పష్టత లేని వాళ్లకు ప్రతీది వయోలేషన్ లాగానే కనిపిస్తది అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
ఇందులో ఖర్చు పెట్టిన రూ. 55 కోట్లు రాష్ట్రానికి వందల కోట్ల రాబడి కోసమే పెట్టినం, మీకేమైనా అనుమానాలు ఉంటే అన్నీ అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తా అని కేటీఆర్ అంటున్నా ముఖం చాటేసి పిరికిపందల్లా ఏసీబీకి ఫైలు అప్పగించారు. అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే అని ఆర్ఎస్పీ నిప్పులు చెరిగారు.
ఎవరినడిగి మీరు ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దుచేశారు? మీరు ముందు నిపుణుల కమిటీతో చర్చించారా? దీనిపై కేబినెట్ అనుమతి తీసుకున్నారా? మీ వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయింది. అసలు ఈ ఫార్ములా -ఈ రేస్ కేసులో రేవంత్ రెడ్డి A-1.. కేటీఆర్ కాదు. ముమ్మాటికీ కాదు. ఇదే నిప్పు లాంటి నిజం. దాచేస్తే దాగని సత్యం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana Bhavan | తెలంగాణ భవన్ మెయిన్ గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
Telangana Bhavan | తెలంగాణ భవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు.. వీడియో