Rayapol | రాయపోల్, ఫిబ్రవరి 23: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో చిన్నారుల విద్య, ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడే అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు,ఉప సర్పంచ్ హనుమంతు రాజు పూజలు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామ స్థాయిలోనే బాలబాలికలకు ప్రాథమిక విద్యా అలవాట్లు, పోషకాహారం,ఆరోగ్య పరిరక్షణ అందించే అంగన్వాడీ కేంద్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని సర్పంచ్ తెలిపారు. కొత్తగా నిర్మించబడే ఈ కేంద్రం ద్వారా చిన్నారులకు ఆటల ద్వారా నేర్చుకునే విద్య, అక్షరాభ్యాసం, సామాజిక నైపుణ్యాల పెంపుదల వంటి అంశాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం,ఆరోగ్య సూచనలు కూడా అందించబడతాయని పేర్కొన్నారు. గ్రామంలోని చిన్నారులు మంచి వాతావరణంలో చదువుకునేలా సదుపాయాలు కల్పించడం తమ లక్ష్యమని చెప్పారు. చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే ప్రాథమిక దశలోనే సరైన విద్య,పోషణ అవసరమని తెలిపారు.