హైడ్రా కమిషనర్‌ను తొలగించాలంటూ హైకోర్ట్ ఆదేశించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఓ సివిల్ సర్వెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని హైకోర్ట్ ధర్మాసనం తప్పుబట్టింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంతా నా ఇష్టం అనే రీతిలో స్పందించారు. ఆయన మాటల్లో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపించింది. ఇది ఇప్పుడు కొత్తకాదు. రోజులు గడుస్తున్నకొద్దీ రేవంత్‌రెడ్డిని అభద్రతాభావం తీవ్రంగా వెంటాడుతున్నది. సొంత పార్టీలోనూ తాను ఒంటరిగా మారియిపోయినట్టుగా ఆయన భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్దాం అని భావించిన వారే ఇప్పుడు అభ్యంతరకరమని వ్యాఖ్యానించే పరిస్థితి తలెత్తింది. ఆయన ప్రసంగాల్లో కనిపిస్తున్న తీవ్ర ఆవేశం, ప్రత్యర్థులపై వ్యక్తిగత వ్యాఖ్యలు, బూతులు, ఒట్లు, తిట్లు, అసహనం వంటి పరిణామాలు ఆయనలో పెరుగుతున్న అభద్రతాభావానికి నిదర్శనం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్ర ముఖ్యమంత్రికి గుక్క తిప్పుకోని పరిస్థితి కల్పిస్తున్నది. ప్రతిపక్షం ఏ అంశాన్ని లేవనెత్తినా జవాబు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగానే అర్థమవుతున్నది. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవకతవకలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వరుసగా బయటపెడుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు అందరూ తమ వంతు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్షం నిలదీసిన ప్రతి అంశానికీ అధికారపక్షం వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో తల ప్రాణం తోకకు వచ్చినంత పని అవుతున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో పథకం ద్వారా వ్యవసాయరంగాన్ని పటిష్టం చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాగు పేకమేడలా కూల్చివేశారు. రైతుబంధు దైవాధీనం అయిపోయింది. యూరియా కోసం చెప్పులు క్యూ కట్టాల్సి వస్తున్నది. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో సీఎం పూర్తిగా తన గురువు చెప్పుచేతల్లోకి వెళ్లిపోయినట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది.
ఈ ధోరణి తెలంగాణ నీటిపారుదల రంగానికి గొడ్డలి పెట్టుగా మారింది. ఉదాహరణకు పోలవరం బనకచర్ల లింక్ కెనాల్ వ్యవహారంపై టెండర్లన్నీ అయిపోయాక సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా లోపభూయిష్ట పిటిషన్ వేసి వీగిపోయేలా చేసింది. ఈ విషయాన్ని హరీశ్‌రావు తెలంగాణ సమాజం ముందు లేవనెత్తేసరికి జవాబు చెప్పలేక సర్కార్ పెద్దలు తప్పించుకున్నారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రశ్నించింది. కేటీఆర్ నేతృత్వంలో జరిగిన కన్నెపల్లి యాత్రతో ముఖ్యమంత్రి రక్షణాత్మక స్థితిలో పడిపోయారు. ప్రజెంటేషన్ల మీద ప్రజెంటేషన్లు ఇచ్చి, పాడిన పాటనే మళ్లీ మళ్లీ పాడారు.
ఇంజినీర్లు నిజాలు చెప్పేసరికి ఆగ్రహావేశాలకు లోనై వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని, చర్లపల్లి జైలుకు పంపాలంటూ చిందులేశారు. కన్నెపల్లి దగ్గర వదిలిన నీళ్లు పట్టిసీమ దగ్గర ఎత్తిపోస్తుండేసరికి డ్యామేజీ కంట్రోల్ కోసం దేవాదుల పంపులు ఆన్ చేశారు. అదే సమయంలో 31 నెలలుగా పడావు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లోని నార్లాపూర్ పంపును కూడా ఆన్ చేయాల్సి వచ్చింది. కాళేశ్వరం వ్యవహారం బూమరాంగ్ కావడంతో ప్రతిపక్షాల దాడిని తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు ఎదురుదాడులు, వ్యక్తిగత దూషణలకు దిగారు. రాష్ట్ర అప్పుల విషయంలో ఒక మంత్రి బీఆర్ఎస్కు సవాల్ విసరటమే కాకుండా బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి మరీ చర్చిస్తామని డాంబికాలు పలికారు. తీరా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ అందుకు సిద్ధం కావడంతో వ్యవహారం బెడిసికొట్టింది.
ముఖ్యమంత్రికి సొంత పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు, ఆగ్రహాలు.. ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించడాలు తారస్థాయికి చేరాయి. రేవంత్‌ను, ఆయన కార్యదర్శిని, ఆయన సోదరులను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత.. సీఎం, ఆయన సోదరులపై ఆరోపణలు చేసినా ఆమెపై చర్యలు తీసుకోలేకపోయాననే అసహనం రేవంత్‌లో నెలకొన్నది.
చాలా మంది మంత్రులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ను ఏదో అన్నారని ఆరోపణలు రావడంతో తర్వాత జవాబు ఇచ్చుకోవాల్సి వచ్చింది. మేడారం విషయంలో సురేఖ, సీతక్క, పొంగులేటి మధ్యన టెండర్ల వివాదం బహిరంగమైంది. తాజాగా కడియం శ్రీహరి, కొండా సురేఖ మధ్య నిప్పు రాజుకుంది. కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ అనే రెండు గ్రూపుల మధ్య పంచాయితీ నెలకొన్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్, అసహనం తన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.
పాలక పక్షాలకు ప్రతిపక్షాల విమర్శలు కొత్త కావు. అయితే ఆ విమర్శలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిస్పందనే ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నది. విమర్శలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వడం, పరిపాలనా పనితీరుతో ప్రజల్లో విశ్వాసం పెంచడం, పార్టీ అంతర్గత అసంతృప్తిని సమన్వయం చేయడం వంటి అంశాలు ఏ ముఖ్యమంత్రికైనా కీలక బాధ్యత. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాయకత్వ లక్షణాలు లేకపోగా, కక్ష సాధింపు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం ఏ పాలకుడికీ మంచిది కాదు. అది దీర్ఘకాలికంగా రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రజలు గమనించి, చర్చించుకొంటున్నారు. తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమయ్యారు. సమయం కోసం వేచి చూస్తున్నారు.
-కోవెల సంతోష్ కుమార్