హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): దక్షిణాదిలోనే రెండో అతి పెద్ద థర్మల్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (వైటీపీఎస్)లో ఓ ఆంధ్రా అధికారి పెత్తనం నడుస్తున్నదని, సంస్థలో ఆయన ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారనే చర్చ నడుస్తున్నది. సదరు అధికారి ఏకంగా ఇంజినీర్ల అధికారులకు కత్తెరపెట్టి, అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకుని మంత్రాంగం నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెన్కో నుంచి జీతం తీసుకుంటూ సంస్థకు మేలు చేయాల్సిందిపోయి.. ప్లాంట్ ప్రైవేటీకరణకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారనే చర్చ నడుస్తున్నది. ఈ కీలక అధికారి ప్రతి శనివారం వైటీపీఎస్లోనే మకాం వేస్తున్నారు. ఆదివారం అక్కడే ఉంటున్నారు. ప్లాంట్‌కు సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారని, ఉద్యోగులను బెదిరిస్తున్నారని, ఏ పని ఉన్నా.. తననే కలవాలి అన్నట్టుగా వ్యవహార శైలి ఉంటున్నదని విద్యుత్తుసౌధ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వన్‌మ్యాన్ షో వ్యవహారం జెన్కోలో రచ్చకు దారితీస్తున్నది. ఇదే విషయంపై జెన్కో థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీసేందుకు ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.
అధికారాలకు కత్తెర
జెన్కోలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యయమయ్యే పనులకు సీఈ స్థాయిలోనే ఓపెన్ టెండర్లు ఆహ్వానించి ఖరారు చేయడం అనవాయితీగా వస్తున్నది. కానీ, సదరు ఆంధ్రా అధికారి ఇప్పుడు ఈ వ్యవస్థను మొత్తం తన గుప్పిట్లోకి లాక్కున్నారని చెప్తున్నారు. రూ.15 వేల విలువైన వాటికి కూడా ఆయన ఆమోదం తప్పనిసరి చేశారట. ప్రొప్రైటరీ స్పేర్‌పార్ట్స్ కింద ప్లాంట్‌కు పరికరాలు సమకూర్చిన సంస్థ నుంచే అవసరమైన విడిభాగాలను కొనుగోలు చేయాల్సి ఉంటుం ది. కానీ, ప్రొప్రైటర్ల ద్వారా కొనకుండా ఇతర కంపెనీలవి అంటగడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్లాంట్ నిర్వహణలో భవిష్యత్తులో సమస్యలొచ్చే ప్రమాదం పొంచి ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు.
సస్పెండ్ చేస్తా
వైటీపీఎస్ టెండర్ల కోసం కింది స్థాయి అధికారులు ఓ ఫైల్ రెడీ చేయగా, దానిని చూసిన సదరు పెద్దసారు కస్సుమన్నారట. అంచనాలు ఇంత తక్కువగా ఎందుకు వేశారని ప్రశ్నించడమే కాకుండా, వారిని సస్పెండ్ చేస్తానని బెదిరించినట్టు చర్చ నడుస్తున్నది. సదరు అధికారి ఓ కంపెనీకి మేలు చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారని, టెండర్లు ఆహ్వానించే క్రమంలో ఓఅండ్ఎం సిబ్బంది సంఖ్యను అధికంగా చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓఅండ్ఎం సిబ్బంది 1,650 మంది అవసరమైతే, ఆ సంఖ్యను 1,913కు పెంచారని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదనేది విద్యుత్తు ఉద్యోగుల ఆరోపణ. టెండర్ల అంచనాలను పెంచాలంటూ కిందిస్థాయి ఉద్యోగులకు బెదిరిస్తున్నారని జెన్కో ఇంజినీర్లల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
8 వేల పెండింగ్ పనులు
వైటీపీఎస్ ప్లాంట్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. అనేక చిన్నాచితకా 8 వేల పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పైగా ఈ ప్లాంట్‌కు పెర్ఫార్మెన్స్ గ్యారంటీ టెస్ట్ (పీజీ టెస్ట్) నిర్వహించలేదు. గంటకు 2,500 టన్నుల బొగ్గు ను మండించాల్సి ఉండగా, ప్రస్తుతం 800 టన్నులు కూడా మండిలించలేకపోతున్నారు. ఈ తరుణంలో టెండర్లకు పోవడం, రూ.255 కోట్ల భారాన్ని సంస్థపై మోపడం విమర్శలకు తావిస్తున్నది. ఈ తరుణంలో ఆగమేఘాల మీద యూనిట్-1, యూనిట్-2ను కాంట్రాక్ట్ సంస్థ నుంచి జెన్కో స్వాధీనం చేసుకున్నది. మిగిలిన మూడు యూనిట్లను స్వాధీనం చేసుకొనేందుకు జెన్కో తొందరపాటు ప్రదర్శిస్తున్నది. పూర్తి కాని ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాడ్లింగ్ ప్లాంట్లను ఔట్‌సోర్సింగ్‌కు ఎందుకు ఇస్తున్నదన్నది ప్రశ్నగా మారింది.
పూర్తికాక ముందే తొందరేల?
ఐదు యూనిట్లల్లో ప్రస్తుతానికి నాలుగు యూనిట్లు మాత్రమే ‘కమిషనింగ్ ఆఫ్ డేట్’ (సీవోడీ) పూర్తి చేసుకోగా, యూనిట్-3లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును ‘ఇన్ఫర్మ్ పవర్’ కిందే వాడుతున్నారు. ఐదో యూనిట్ సీవోడీ ఇంకా పూర్తి కాలేదు. తాజా టెండర్లు ఖరారైతే మొత్తం ఐదు యూనిట్లకు రూ.255 కోట్లు జెన్కో చెల్లించాల్సి ఉంటుంది. అంటే వినియోగంలో లేని, పూర్తికాని యూనిట్లకు కూడా సొమ్ములు చెల్లించాలి. మొత్తంగా జెన్కో సొమ్ములను అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టబోతున్నారన్నది ఆరోపణ.
విఫలమైతేనే..
జెన్కోలో ఉద్యోగులు ఎక్కువ ఉన్నారనేది విద్యుత్తు సంస్థల్లోని కీలక అధికారులు నోటి నుంచి తరచూ వచ్చే మాట. ‘మ్యాన్ మెగావాట్ రేషియో’ మన దగ్గరే అధికంగా ఉన్నదంటూ పలు సమావేశాల్లోనూ అధికంగా ఉన్న వారిని సర్దుబాటు చేసేందుకు, ఉద్యోగులు, ఇంజినీర్ల రేషనలైజేషన్‌కు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఉన్న సిబ్బంది, ఇంజినీర్ల సేవలను వాడుకోకుండా వైటీపీఎస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎందుకు టెండర్లు పిలిచారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవానికి కొంతకాలంపాటు జెన్కో నిర్వహించి, ఆ తర్వాత విఫలమైతే ప్రైవేట్‌కు, ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించవచ్చు. కానీ, ముందుగానే టెండర్లు పిలవడం వెనుక ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేటీకరించే ప్రమాదం పొంచి ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా విద్యుత్తు ప్లాంట్లల్లో ఓఅండ్ఎం వర్క్స్‌ను ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తుంటారు. కానీ, ఇందుకు విరుద్ధంగా వైటీపీఎస్‌లో జరుగుతున్నదని ఇంజినీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. హైస్కిల్డ్ ఉద్యోగాలను సైతం ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారని, దీంతో డీఈ స్థాయి ఇంజినీర్లు మాత్రమే జెన్కోకు చెందిన వారై ఉంటారని, మిగతా వారంతా ప్రైవేట్ వారేనన్నది ఇంజినీర్ల వాదన.
అంచనాలెందుకు పెరిగినట్టు?
వైటీపీఎస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించేందుకు టీజీ జెన్కో టెండర్లు ఆహ్వానించింది. పవర్మెక్తోపాటు మరో రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే, ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం వెనుక భారీ తతంగం జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంచనాలను అడ్డగోలుగా పెంచినట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వైటీపీఎస్ ఉద్యోగుల ప్రతిపాదనలను పూర్తిగా పక్కనపెట్టి విద్యుత్తు సౌధ నుంచే మొత్తం ప్రతిపాదనలు రెడీ చేశారట. కొంతకాలం క్రితం ఆరు నెలల నిర్వహణకుగాను రూ.34.5 కోట్లు అవుతుందని అంచనావేశారు. ఈ లెక్కన మూడేండ్లకు రూ.207 కోట్లు మాత్రమే అవుతుంది. కానీ, ప్రస్తుతం రూ.255 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. మొదట ప్రతిపాదించిన దానికంటే రూ.48 కోట్ల మేర అంచనాలు పెరిగాయి. ఎవరికి మేలు చేసేందుకు.. ఎవరి జేబులు నింపేందుకు.. ఈ అంచనాలను పెంచారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
