రామడుగు, జూలై29: ‘మాట్లాడితే చాలు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వ్యాఖ్యలు చేసిన సన్నాసులు కండ్లు తెరవాలి. లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ నుంచి పరవళ్లు తొక్కుతున్న జలాలను చూడాలి’ అని కాంగ్రెస్ నాయకులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చురకలంటించారు. రామడుగు మండలం గాయత్రీ పంపుహౌస్‌లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు 1,2,4 మోటర్లను అధికారులు ప్రారంభించగా, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుంకె తరలివెళ్లారు. ఎగిసిపడుతున్న జలాలకు పసుపు కుంకుమ, పూలతో అభిషేకించారు.
ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత, బీఆర్ఎస్ నాయకులు, రైతుల పోరాటాలతోనే సర్కారు ఈ రోజు ఎల్లంపల్లి బరాజ్ నీటిని ఎత్తిపోస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు పనికిరాదనీ ప్రచారం చేసిన వారికి నేడు ఆ ప్రాజెక్టు నీళ్లే సమాధానం చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం సరికాదన్నారు.
ఎన్డీఎస్ఏ నివేదికలో బరాజ్‌ల భద్రత మాత్రమే తమ పరిధిలో ఉంటుందని, నీటి నిర్వహణ, సాగునీటి పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. కన్నెపల్లి పంపులను ముందుగానే ప్రారంభించి గాయత్రీ పంపుహౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తే శ్రీ రాజరాజేశ్వర, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు తరలించుకునే అవకాశం ఉండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు వేసుకున్న నారుమడులు ఎండిపోయాయని, జూలై చివరిదశకు చేరుకున్నా ఇప్పటికీ నాట్లు వేసే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గాయత్రీ పంపుహౌస్ ద్వారా నీటి విడుదల కొనసాగించి ప్రతి చెరువు, రిజర్వాయర్‌ను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.