Telangana Bhavan | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా తెలంగాణ భవన్ మెయిన్ గేటు ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేసి తమ నిరసనను వ్యక్తపరిచారు.
ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు.
కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతితో తదుపరి చర్యలకు కాంగ్రెస్ సర్కార్ ఉపక్రమించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై అభియోగం మోపారు. కేటీఆర్‌పై 4 సెక్షన్లు.. 13(1)A, 13(2)పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.
ఫార్ములా – ఈ కార్ రేసులో కేసు నమోదుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభా వేదికగా స్పందించారు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు పెడితే.. సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మిమ్మల్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే చిత్తశుద్ధి ఉంటే, ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందని అంటున్నారు కదా..? దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అని కేటీఆర్ స్పష్టం చేశారు.