Errolla Srinivas | హైదరాబాద్ : ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సచివాలయం ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పరోక్షంగా రాజీవ్ గాంధీని కూడా అవమానించాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. తన అహంకారం కోసం, తన రాజకీయ ప్రభావం కోసం, పార్టీలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం, అధిష్టానం అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెట్టాడని శ్రీనివాస్ నిప్పులు చెరిగారు.
సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిన ముఖ్యమంత్రి.. ఈ రోజు పార్టీ మెప్పుకోసం విగ్రహాలు ఏర్పాటు చేసే చౌకబారు ఎత్తుగడవేశారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయలేదు అంటున్నావ్ ముఖ్యమంత్రి..! తెలంగాణ తల్లి స్వరాష్ట్ర ఉద్యమం నుంచి ఉబికి వచ్చిన ఉద్యమ ప్రతీక. ప్రతి గ్రామంలో, ప్రతి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాం. ఉమ్మడి రాజధాని కాలం ముగిసిన సందర్భంగా తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్టించాలి అనుకున్నామని శ్రీనివాస్ తెలిపారు.
మే 30, 2023 నాడు సీఎం హోదాలో కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి, సమీక్షించి స్థలాన్ని కేటాయించామని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఒకవైపు అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అమరుల స్తూపం, సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించాలనుకున్నాం. కానీ, తెలంగాణ ఉద్యమంతో, చరిత్రతో, సంస్కృతితో ఎలాంటి సంబంధంలేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి నువ్వు మరోసారి తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టావు. ఎవరెన్ని చెప్పినా సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం అసంబద్ధంగానూ, తెలంగాణ ప్రజల కళ్ళలో నలుసు మాదిరిగానూ మిగిలిపోతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | కంప్యూటర్ను పుట్టించింది రాజీవ్ గాంధీ అట.. సీఎం రేవంత్ రెడ్డి మాట!!