Balka Suman | హైదరాబాద్ : కాంగ్రెస్ పది నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు.. కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్క సుమన్ పేర్కొన్నారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన రేవంత్ రెడ్డి మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో సభ ఏర్పాటు చేశారు. యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేరలేదని సుమన్ ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అని యువతను నమ్మించి మోసం చేశారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీఆర్ఎస్ చెప్పింది. మేము అధికారంలో ఉన్నప్పుడు లక్షా 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాము. ప్రయివేటు రంగంలో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో వచ్చాయి. దయ్యాలు సీఎం మాటలు విని సిగ్గుపడుతున్నాయి. టీచర్ ఉద్యోగాలకు మేము 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 5 వేల ఉద్యోగాలు యాడ్ చేసింది అని సుమన్ తెలిపారు.
ఆరు గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేయడం లేదు. రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని అన్నారు. రైతులందరికి రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటెన్షన్ డైవర్షన్ చేస్తోంది. మూటలు సర్దుకుని ఢిల్లీకి మూటలు పంపడంపై రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభయహస్తం నిరుద్యోగుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. నిరుద్యోగులను ముఖ్యమంత్రి ఎందుకు కలవడం లేదు..? ఒక్క మంత్రి అయినా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా..? ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల చుట్టూ తిరిగారు. రాష్ట్రం అంతా నిరుద్యోగ యాత్రలు చేయించారు. ఇప్పుడేమో అదే నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాల్క సుమన్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Teegala Krishna Reddy | టీడీపీలో చేరనున్న తీగల కృష్ణా రెడ్డి..!