Bajireddy Govardhan | నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రెండు అధిష్టానాలు ఉన్నాయని, పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో ఆయన అనుబంధం కొనసాగుతుంది అని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు పెట్టగానే ఈడీ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపారు. కేటీఆర్, కవిత, హరీశ్‌రావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోదీని, అదానీని విమర్శిస్తారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి మోదీ, అదానీతో అంటకాగుతున్నారు అని బాజిరెడ్డి మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి సీఎం అయిందే అబద్ధాలతో అని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రేవంత్ అబద్దాల అలవాటు మార్చుకోవడం లేదు. నిన్నటి వరకు కాళేశ్వరం సహా అనేక విషయాలపై అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. ఏసీబీ రేవంత్ రెడ్డి జేబు సంస్థలా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డికి చేతగాకుంటే సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. దేశంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది హైదరాబాద్‌లోనే. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నుంచి ఫార్ములా సంస్థకు చెక్ ద్వారా నిధులు ఇచ్చారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో కొనసాగుతోన్న చలి.. రాబోయే ఐదు రోజులు జర జాగ్రత్త..!
KTR | నా మాటలు రాసిపెట్టుకోండి.. రేవంత్ సర్కార్ కక్ష సాధింపులపై కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్!