BRS Dharna | నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించబోయే బీఆర్ఎస్ మహా రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ – హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రైతు భరోసా కుదింపుపై ఉమ్మడి నల్గగొండ జిల్లా వ్యాప్తంగా రైతులు కొద్దిరోజులుగా ఆగ్రహంతో రోడ్లపైకి వస్తున్నారు. రైతుల ఆందోళన, ఆవేదనకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్‌తో ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ రైతు మహాధర్నాకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ ప్రకటించింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మహాధర్నాకు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ.. సంక్రాంతి పండుగ రద్దీ, ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగంలో అత్యధిక లబ్ధి పొందిన జిల్లా నల్లగొండనే అవడం విశేషం. ఉచిత విద్యుత్ వినియోగం, సాగునీటి రంగం, రైతుబంధు లబ్ధిలోనూ నల్లగొండకు అత్యధిక ప్రయోజనం చేకూరింది. అందుకే సమైఖ్య పాలనలో ఉమ్మడి జిల్లాలో 13 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేసీఆర్ హయాంలో అది 23 లక్షల ఎకరాలకు చేరింది. అలా పంటల దిగుబడిలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నల్లగొండ జిల్లా ప్రముఖ స్థానంలో నిలిచింది. కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి చూపితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని తిరిగి కుదేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నది. రుణమాఫీ అమలు, రైతుభరోసా డబ్బుల్లోనూ ప్రభుత్వ విధానాలతో తీరని అన్యాయం జరుగుతున్నది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం నేటికీ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల మందికిపైగా రైతులు ఎదురుచూస్తున్నారు. రైతుభరోసా ద్వారా ఉమ్మడి జిల్లాలో 25 లక్షల మంది రైతులకు ఒక్క సీజన్లోనే ఎకరాకు రూ.7,500 చొప్పున పెట్టబడి సాయం అందిస్తే సుమారు రూ.1,950 కోట్ల లబ్ధి రైతులకు జరగాల్సి ఉంది. కానీ దాన్ని ఆరు వేలకు కుదించడం వల్ల ఆ లబ్ధి రూ.1,300 కోట్లు కూడా దాటేలా లేదు. గత యాసంగిలో ఎకరం మీద రూ.2,500 కోత, వానకాలంలో మొత్తంగా రూ.7,500కి ఎసరు, ప్రస్తుత సీజన్లో సైతం ఎకరాకు రూ.1,500 కోత పెట్టడం వల్ల మొత్తంగా 11,500 రూపాయలను ఒక్కో ఎకరంపైన రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోతున్నాడు. మొత్తంగా చూస్తే సుమారు 3 వేల కోట్ల రూపాయల రైతు భరోసాకు కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. ఎన్నికల హామీ, వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఎకరాకు రూ.7,500 రైతుభరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆవేదనను అర్ధం చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. రైతుభరోసా మోసంపై నల్లగొండ వేదికగా రాష్ట్రంలోనే తొలి రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొననున్నారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో వేలాది మంది రైతులతో ఆదివారం ఉదయం 10 గంటలకు రైతు మహాధర్నాకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్యులంతా మహా ధర్నా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ మహాధర్నా అనుమతి కోసం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డికి దరఖాస్తు అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరితో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు కావాల్సిన సహకారం పార్టీ శ్రేణులు అందించాలని సూచించారు. రైతులు కూడా పెద్దసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ధర్నా స్థలంలో ఏర్పాట్లు చేయాలని జగదీశ్‌రెడ్డి స్థానిక నేతలకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టడం దారుణం : కేటీఆర్
Pantangi Toll Plaza | సంక్రాంతికి సొంతూళ్లకు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటకు 900 వాహనాలు క్రాస్
Margani Bharat | టీటీడీ పాలక మండలి రాజీనామా చేయాలి : మాజీ ఎంపీ భరత్ డిమాండ్