న్యూఢిల్లీ: సాధారణంగా పెద్ద వయసు వారికి వచ్చే పెద్ద పేగు క్యాన్సర్ (కోలోరెక్టాల్ క్యాన్సర్) ఇప్పుడు యువతలో కూడా పెరుగుతోంది. 50 ఏండ్లలోపు వారు ఈ క్యాన్సర్కు గురి కావడానికి అత్యంత కీలకమైన లక్షణాన్ని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. అది మల ద్వారం నుంచి రక్తం స్రవించడం (రెక్టాల్ బ్లీడింగ్). ఈ లక్షణం ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏకంగా 850 శాతం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని లూయిస్ విల్లే హెల్త్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో 50 ఏండ్ల లోపు వయసున్న 443 మంది రోగుల రికార్డులను విశ్లేషించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు సగం మందికి ఎర్లీ ఆన్సెట్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. ఈ రోగులలో రక్తస్రావం అనేది అత్యంత స్పష్టమైన, తీవ్రమైన ప్రమాద సంకేతంగా వెల్లడైంది.