‘మా చేతుల్లో మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నరు. వాళ్లే కోరుకుంటున్నంక ఇంక మాదేముందీ? మోసపోయేవాళ్లు ఉన్నరు కాబట్టే మోసం చేస్తున్నం. నమ్మితేనే గదా మోసం చేయగలం’ అని నయవంచక కాంగ్రెస్ సర్కారు నైజం గురించి గతంలో రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగానే చేశారు. మోసం చేసి చూపించారు. కామారెడ్డి సాక్షిగా బీసీలను నమ్మించి, అసెంబ్లీ వేదికగా తడిగుడ్డతో గొంతు కోశారు. చెల్లుబాటు కాని చట్టాలు చేస్తూ, జవసత్వాలు లేని జీవోలు తీసుకొస్తూ, తన అనుచరులతోనే కోర్టులో కేసులు వేయిస్తూ బీసీ సోదరులకు రేవంత్‌రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మేక వన్నె పులి వంటిది. నమ్మకద్రోహం, నయవంచనే ఆ పార్టీ నైజం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మొదటినుంచీ ముంచాలనే చూస్తున్నది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నది. నిమిషానికో మాట మాట్లాడుతూ, గంటకో విధానాన్ని ప్రకటిస్తూ, పూటకో ఆర్డినెన్స్ తెస్తూ, రోజుకో బిల్లు తీసుకొస్తూ, నెలకో జీవో విడుదల చేస్తూ ఉద్దేశపూర్వకంగానే నాటకాలాడుతున్నది. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశం లేకపోవడం, అసమర్థత, బీసీల పట్ల చిత్తశుద్ధి లోపించడమే అందుకు ప్రధాన కారణం. రిజర్వేషన్లు కల్పిస్తే బలహీనవర్గాలు బలపడుతాయన్న భయంతోనే కాంగ్రెస సర్కార్ మొదటినుంచీ డ్రామాలాడుతున్నది. ఈ డ్రామా వెనుక ఉన్న కపట నాటక సూత్రధారి రేవంత్‌రెడ్డేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్, కులగణన నుంచి మొదలుకొని ఇటీవల తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేత, తాజా జీవో వరకు అ న్నీ బీసీలను నమ్మించి విద్రోహం చేసే పన్నాగాలే తప్ప, రిజర్వేషన్లు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కావన్నది బలహీనవర్గాల సోదరులు అర్థం చేసుకోవాలి.
‘చెల్లని రూపాయికి గీతలెక్కువ’ అన్నట్టున్నది రేవంత్‌రెడ్డి సర్కారు తీరు. బీసీలను ఉద్దరిస్తున్నట్టు ఎగిరెగిరి పడుతూ, ఊదరగొడుతూ నిత్యం ఏదో ఒక చట్టం, జీవో, ఆర్డినెన్స్ అంటూ హడావుడి చేస్తున్నది. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవడానికి బదులుగా, ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ఎక్కువగా కష్టపడుతున్నది. అందుకోసం మొదటినుంచీ తప్పులమీద తప్పులు చేస్తూ, బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుపడటంలో విజయవంతంగా సాగుతున్నది.
అసలు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే రాష్ట్రంలో అడ్డుకునేదెవరు? అసెంబ్లీ సాక్షిగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. తెస్తున్న బిల్లుకల్లా సమ్మతిస్తున్నాయి. వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ సర్కారుకే లేదు.
నీ ముక్కు ఏదంటే, చుట్టూ తిప్పి చూపించినట్టు.. రిజర్వేషన్ల అంశాన్ని చుట్టూ తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నది కాంగ్రెస్. రిజర్వేషన్లపై చట్టం, ఆర్డినెన్స్, మరో చట్టం, జీవో, పార్టీపరంగా రిజర్వేషన్లు అంటూ మరింత జఠిలం చేస్తున్నది. అసెంబ్లీ- గవర్నర్, గవర్నర్- రాష్ట్రపతి, హైదరాబాద్- ఢిల్లీకి తిప్పుతూ కాలహరణం చేస్తున్నది. మొదట రాజ్యాంగయుతంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి బీసీ కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడే తప్పులో కాలేసింది. డెడికేటెడ్ కమిషన్‌ను నియమించకుండానే, రెగ్యులర్ బీసీ కమిషన్‌కు ఆ బాధ్యతను అప్పగించి ఆదిలోనే తప్పటడుగు వేసింది. 2021లో వికాస్ కిషన్‌రావు గవాళి కేసులో జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తేనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినట్టుగా ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, ట్రిపుల్ టెస్టు ద్వారా ప్రతీ గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ వెనుకబాటును నిర్ధారించాలి.
ఆ డేటా ప్రకారం బిల్లులు రూపొందించి, రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తేనే, అది న్యాయస్థానాల ముందు నిలుస్తుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను కావాలనే విస్మరించింది. డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండానే, రెగ్యులర్ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన సర్వేకు అన్ని ఏర్పాట్లు చేసింది. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో చివరి నిమిషంలో సర్వేకు రెండు రోజుల ముందుగా 2024 నవంబర్ 4న బూసాని నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ నేపథ్యంలో ముందుగానే చేయాల్సిన జిల్లాల పర్యటనలు, అభిప్రాయ సేకరణలు బూసాని కమిషన్ కులగణన సర్వే జరుగుతున్న సమయంలో చేసింది. దాంతో సర్వేలో అన్నీ తప్పులు దొర్లాయి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే నివేదిక ప్రతులను తగులబెట్టడం అందుకు నిదర్శనం.
ఈ తప్పులున్న సర్వే ఆధారంగానే బూసాని కమిషన్ 42 శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసింది. దాని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను 2025, మార్చి 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లులను ఆమోదించి, రాష్ట్రపతికి పంపించకముందే ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను పంపించారు. తప్పులతడకగా ఉన్న డేటాతో రూపొందించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించరని, కొత్తగా బీసీ రాగం ఎత్తుకున్న బీజేపీ అందుకు ఒప్పుకోదని తెలిసీ, మళ్లీ ఆర్డినెన్స్ డ్రామా చేశారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏదో ఘనత సాధించినట్టుగా కాంగ్రెస్ మంత్రులు స్వీట్లు పంచుకున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుమతి లేకుండా ఆ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఎలాగూ ఆమోదించరు. కాబట్టి, పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కొత్త పల్లవి అందుకున్నారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడం ఏ మాత్రం ఇష్టం లేని రేవంత్‌రెడ్డి మనసు అందుకూ అంగీకరించలేదు. అందుకే తాజాగా జీవో పేరిట మరో నాటకానికి తెరలేపారు. పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణకు పూనుకున్నారు. ఇది మరో వంచన తప్పితే, రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం కానే కాదు.
ప్రామాణికత లేకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం కంటే ఎక్కువకు పెంచితే,అప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు కూడా బీసీలకు దక్కవని కోర్టులు చెప్తున్నాయి. గతంలో మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ర్టాల ఉదాహరణలు మన కండ్లముందే కనిపిస్తున్నాయి.
రాజ్యాంగబద్ధత లేని రిజర్వేషన్లను కొట్టివేస్తూ, అప్పటివరకు ఆయా రాష్ర్టాల్లో ఓబీసీలకు దక్కుతున్న రిజర్వేషన్లను తొలగించి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పుచెప్పింది. ప్రామాణికమైన సర్వే నివేదిక లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా జీవో ఇస్తే, అది న్యాయస్థానాల ముందు చెల్లుబాటు కాదు. దీనివల్ల అసలుకే ఎసరు వస్తుంది. ఇప్పటివరకు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లను కూడా దక్కకుండా చేయాలన్నదే కాంగ్రెస్ కుట్ర.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యార్థులు, యువత, రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా యూరియా దక్కక అన్నదాతలు హస్తం ప్రభుత్వంపై కన్నెర్రజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజలు కర్రుకాల్చి వాతపెడుతారని కాంగ్రెస్‌కు, ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి తెలుసు. అందుకే, స్థానిక ఎన్నికలపై తాత్సారం చేసేందుకు రిజర్వేషన్ల అంశాన్ని చిక్కుల్లో పడేసి కాలయాపన చేస్తున్నారు. అందుకే, చెల్లుబాటు కానటువంటి చట్ట సవరణ చేశారు. కనీసం ఆ చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపేంత వరకూ ఆగకుండా జీవో తీసుకొచ్చారు. ఆ జీవోను తన అనుచరుల ద్వారా కోర్టు వివాదాల్లోకి లాగి ఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి అనుచరుడు రెడ్డి జాగృతి అధ్యక్షుడితో కోర్టులో కేసు వేయించారు. అయినా పేదోళ్లు అయితే తన సామాజికవర్గం వారిని సైతం ఇంట్లోకి రానివ్వనని చెప్పిన రేవంత్‌రెడ్డి.. బీసీలను మాత్రం గ్రామపంచాయతీల గడప తొక్కనిస్తారా?
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
-ఓ.నరసింహారెడ్డి