వీణవంక, అక్టోబర్ 4: ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని అమలు చేయకుండా ఎగనామం పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందించకుండా రాష్ట్రంలో రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని.. కాంగ్రెస్ హయాంలో అథోగతి పాలవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా వీణవంకలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులకు 24గంటల కరెంట్ ఇవ్వలేదని, రూ.2లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని, రైతుబంధులో విషయంలోనూ మోసం చేసిందని, వరికి బోనస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కల్వల ప్రాజెక్ట్ పూర్తయితే ఎంతో మంది లబ్ధి పొందుతారని, ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. హుజూరాబా ద్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.