హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉన్న మాట అంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎల్బీనగర్ టిమ్స్‌ను సందర్శిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. హరీశ్‌రావుపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను శనివారం సంయుక్త ప్రకటనలో ఖండించారు.
24 /7 ప్రజా సమస్యల పరిషారం కోసం తపించే నాయకుడు హరీశ్‌రావు అని తెలిపారు. ఎల్బీనగర్ టిమ్స్‌ను హరీశ్‌రావు సందర్శిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే అని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వర్షాలు ఉన్నపుడే ఉ సిర్లు వచ్చినట్టు ఎన్నికలున్నపుడే కాంగ్రెస్ నేతలు వస్తారని, అది కాంగ్రెస్ నేతల లక్షణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకుల అలవాటును హరీశ్‌రావుకు ఆపాదిస్తే ప్రజలు నవ్వుకోరా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఇటీవలే సిద్దిపేటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సందర్శించారని, అకడేమీ ఎన్నికలు లేవని చురుకలంటించారు.
బీఆర్ఎస్ పాలనలో వైద్య ఆరోగ్య మంత్రిగా హరీశ్‌రావు ఎన్ని సంసరణలు తెచ్చి ప్రజల మన్ననలు పొందారో అందరికీ తెలుసని, కళ్లుండీ చూడలేని కబోదులు కాంగ్రెస్ నేతలేనని వివేకానందగౌడ్, కాలేరు వెంకటేశ్ విమర్శించారు. హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక ఆయనపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
కాంట్రాక్టులు, కమీషన్ల దందాల్లో తలమునకలయ్యే కాంగ్రెస్ నేతలా హరీశ్‌రావు చిత్తశుద్ధిని శంకించేది? అని మండిపడ్డారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, బస్తీ దవాఖానలు కేసీఆర్ హయాంలో కట్టించకపోతే కాంగ్రెస్ నేతలు కట్టించారా? అని నిలదీశారు. హరీశ్‌రావు టిమ్స్ సందర్శించేదాకా కాంగ్రెస్ నేతలకు టిమ్స్ భవనాలు కడుతున్నారనే విషయం తెలుసా? అని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్యరంగానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమైనా చెప్పదలచుకుంటే సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలి గానీ, హరీశ్‌రావుకు కాదని హితవుపలికారు.