న్యూఢిల్లీ, అక్టోబర్ 4: చాలా మందికి అమెరికాలో ఉద్యోగం ఒక కల. మరికొందరికి పెద్ద హోదా, గౌరవం. కానీ కొత్త వీసా నిబంధనలతో అగ్రరాజ్యంలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ యువతి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అనన్య జోషీ అనే యువతి అమెరికాను వీడి భారత్ వస్తూ ‘లవ్ యూ అమెరికా’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేసింది. అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులు ఆ పరిధిని దాటి ఆలోచించాలని సూచించింది. తాను ఉద్యోగ అవకాశం కోల్పోయినప్పుడు ఒక కంపెనీలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఎఫ్-1 వీసాపై ఉన్నట్టు తెలిపింది. ఉద్యోగం కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కంపెనీల అధికారులు కుదరదని చెప్పడంతో జాబ్ కోల్పోవాల్సి వచ్చిందని చెప్పింది. అమెరికాలో ఉన్నది రెండు నెలలే అయినా 20, 30 ఇంటర్వ్యూలకు హాజరైనట్టు పేర్కొంది. ఎఫ్-1 వీసాతో ఓపీటీలో ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని, గ్రీన్‌కార్డ్, పౌరసత్వం ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేసింది. అమెరికాలో ఉన్నది తక్కువ కాలమే అయినా చాలా అనుభవం లభించిందని పేర్కొంది. భారతీయులు అమెరికాను దాటి ఆలోచించాలని సూచించింది.