వాషింగ్టన్, అక్టోబర్ 4: కడుపులో చల్ల కదలకుండా యూఎస్‌లో శాశ్వత ఉద్యోగం. అయితే జీవితంలో ఏదో సాధించాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన చిన్నపాటి స్టార్టప్. రెండింటికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని సంకట స్థితి. అదే సమయంలో ఆకస్మాత్తుగా చేస్తున్న ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మరో ఉద్యోగం వెతుక్కోవాలా? లేక ఉన్న స్టార్టప్‌ను అభివృద్ధి చేస్తూ జీవిత లక్ష్యాన్ని సాధించుకోవాలా అన్న తీవ్ర ఊగిసలాట. ఎట్టకేలకు స్టార్టప్ కొనసాగింపునకే మొగ్గుచూపిన ఓ భారతీయుడు ఆరు నెలల కాలంలోనే దాని ద్వారా రూ.44 లక్షల ఆదాయాన్ని అందుకుని అందరి ప్రశంసలు పొందాడు. ప్రతికూలతను విజయంగా మార్చుకున్న హర్షిల్ తోమర్ స్ఫూర్తివంతమైన తన విజయ గాథను ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో పలువురు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
హర్షిల్ తోమర్ పోస్ట్ ప్రకారం ‘రిమోట్ జాబ్ చేసే నన్ను ఒక రోజు జరిగిన స్టాండప్ కాల్లో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ వారు ప్రకటించారు. ఉద్యోగం పోయిన 15 రోజుల పాటు తీవ్ర గందరగోళంలో గడిపాను. రెఫరల్స్ కోసం నా స్నేహితులను అభ్యర్థించాను. వారిలో కొందరు సానుకూలంగా స్పందించారు కూడా. ఒక వైపు ఉద్యోగం లేదన్న బాధ, మరోవైపు భవిష్యత్తు లక్ష్యాలపై పెట్టుకున్న ఆశలు నన్ను ఆలోచింపచేశాయి. ఎట్టకేలకు నా స్టార్టప్పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించా. దాని అభివృద్ధికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశా. ఆరు నెలల్లో వ్యాపారంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఆరు నెలల్లో నా స్టార్టప్ 50 వేల డాలర్ల (రూ.44 లక్షలు) ఆదాయాన్ని పొందింది. నా ఉద్యోగుల సంఖ్య ఒకటి నుంచి 10కి చేరింది. ఎక్స్‌లో స్పాన్సరర్లు వచ్చారు. సొంత స్టార్టప్ వ్యవస్థను నిర్మించుకున్నా. మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నా. ఒక దానికి లాక్ అవ్వండి. ఏ రంగంలో ఉన్నా కష్టపడి పనిచేయండి, మీకు ఏమి కావాలో ఊహించుకోండి. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకండి’ అంటూ తోమర్ తన విజయగాథను వివరించాడు.