హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): జర్మనీలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏజెంట్లను ఎక్కువగా నమ్మవద్దని భారత్తో జర్మనీ రాయభారి ఫిలిఫ్ అకెర్మాన్ హెచ్చరించారు. మోసగాళ్లపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెంట్లు ప్రముఖ వర్సిటీలను పక్కన పెట్టి, తమ లాభం కోసం నాసిరకం విద్యనందించే వర్సిటీల కోసం పని చేస్తారని, దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదమున్నదని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఏజెంట్లను నమ్మి అడ్మిషన్లు పొందే విద్యార్థులున్నట్లు తాను భావిస్తున్నట్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జర్మనీతో సంబంధం లేని కొన్ని వర్సిటీలు ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తున్నదన్నారు.
భారత దేశంలోని జర్మనీ మిషన్స్ దాదాపు 25 శాతం స్టూడెంట్ వీసా దరఖాస్తులను తిరస్కరించాయని చెప్పారు. దీనికి కారణం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఏజెంట్లని తెలిపారు. వీరిలో కొందరు ఏజెంట్లు విద్యార్థులను చేర్చడం కోసం అంతగా తెలియని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో కాంట్రాక్టులు కుదుర్చుకుంటారని వివరించారు. విద్యార్థులను చేర్చినందుకు ఏజెంట్లు సొమ్ము తీసుకుంటారన్నారు. జర్మనీలోని 60,000 మంది భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు చాలా మంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్నారన్నారు. ఏజెంట్లకు సొంత ఎజెండా ఉంటుందని, డబ్బు సంపాదనే వారి ఏకైక లక్ష్యమన్నారు. వారు ఫీజు కింద 10వేల యూరోలను వసూలు చేస్తున్నారని, ఇది ఏజెంట్లకు లాభదాయకంగా మారిందని వ్యాఖ్యానించారు. జర్మనీలోని పబ్లిక్ యూనివర్సిటీల్లో ఉచిత విద్య లభిస్తుందని దీనిని విద్యార్థులు విస్మరించరాదన్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు జర్మన్ డిగ్రీలను జారీ చేయవని, కానీ ఇతర దేశాల నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఏజెంట్ల మాటలు విని మోస పోయిన వారికి నిరాశే మిగులుతుందన్నారు. ఏజెంట్లు వీసా దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారమిస్తారని, ఈ కారణంగా వీసా తిరస్కరణ రేట్ కూడా అధికంగా ఉంటుందన్నారు.
జేఎన్టీయూ ఒప్పందంపై సందేహాలు
జర్మనీలో ప్రైవేట్ వర్సిటీలు, ఏజెంట్ల మోసాలపై సాక్షాత్తు ఆ దేశ రాయబారి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జర్మనీలోని విద్యాసంస్థలతో మన విద్యా సంస్థల ఒప్పందాలు సక్రమమేనా? అన్న అనుమానాలొస్తున్నాయి. మన రాష్ర్టానికి చెందిన జేఎన్టీయూ జర్మనీలోని నాలెడ్జ్ ఫౌండేషన్ రౌట్లింజన్ యూనివర్సిటీ (కేఎఫ్ఆర్యూ)తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఐదున్నరేండ్ల బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీకోర్సు నిర్వహణకు అగ్రిమెంట్ చేసుకున్నది. ఓ ప్రైవేట్ వ్యక్తి, కన్సలెన్సీలు మొత్తం తతంగాన్ని నడిపించినట్లు తెలుస్తున్నది. ఇది జర్మనీలో టాప్-3 విద్యాసంస్థ అంటూ, తక్కువ ఫీజుతో సీఎస్ఈ కోర్సును పూర్తి చేయవచ్చంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు. సదరు ప్రైవేట్ వ్యక్తి మోసాలపై జర్మనీలో ఉండే ఓ తెలుగు వ్యక్తి జేఎన్టీయూకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే జేఎన్టీయూ మాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లింది. విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించింది. విద్యార్థులను చేర్పించినందుకు తనకు కమీషన్ వస్తుందని, తానేం సేవ చేయడంలేదని సదరు ప్రైవేట్ వ్యక్తి చెప్పడం గమనార్హం.
బాగోతాలు కోకొల్లలు..
జేఎన్టీయూ ఒప్పందం వెనుకున్న ప్రైవేట్ వ్యక్తి బాగోతాలు కథలు కథలుగా ప్రచారంలో ఉన్నాయి. సదరు ప్రైవేట్ వ్యక్తి జర్మన్ వర్సిటీ పేర తెలుగు రాష్ర్టాల్లో కుచ్చుటోపి పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇతగాడి మోసాలపై ‘జర్మన్ వర్సిటీ జంతర్ మంతర్’ పేరిట పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. జర్మనీ విద్య పేరిట ఆ కోర్సు.. ఈ కోర్సు..అంటూ లక్షల్లో వసూలు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇతను ఏపీ ఉన్నత విద్యామండలితో ఒప్పందాలు చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. డమ్మీ వర్సిటీ పేరిట వర్సిటీల్లో ఆన్లైన్ సమావేశాలు, సదస్సులు పేరిట దందా నడిపారని సమాచారం. 2018 నుంచి జర్మనీ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్, జర్మన్ మాస్టర్ కోర్సులు, జర్మనీలో ఉద్యోగాల పేరిట భారీగా దండుకున్నట్లు ఆరోపణలున్నాయి.
విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. స్కిల్ డెవలప్మెంట్లో ఫేక్ ట్రైనింగ్ పేరుతో ఫేక్ బిల్లులు పెట్టి రూ.10 కోట్లపైగా దోపిడీ చేసినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. భారత దేశంలోని జర్మనీ మిషన్స్ దాదాపు 25 శాతం స్టూడెంట్ వీసా దరఖాస్తులను తిరస్కరించాయని చెప్పారు. దీనికి కారణం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఏజెంట్లని తెలిపారు. వీరిలో కొందరు ఏజెంట్లు విద్యార్థులను చేర్చడం కోసం అంతగా తెలియని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో కాంట్రాక్టులు కుదుర్చుకుంటారని వివరించారు. విద్యార్థులను చేర్చినందుకు ఏజెంట్లు సొమ్ము తీసుకుంటారన్నారు. జర్మనీలోని 60,000 మంది భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు చాలా మంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్నారన్నారు. అతి తక్కువ మంది మాత్రం తమ ఏజెంట్ల మాటలను వింటున్నట్లు కనిపిస్తున్నదని చెప్పారు. ప్రైవేట్ ఏజెంట్లను మితిమీరి నమ్మవద్దని, వారు తమ ఎజెండా కోసం పని చేస్తారని చెప్పారు. డబ్బు సంపాదించడమే ఏజెంట్ల లక్ష్యమని తెలిపారు.