హైదరాబాద్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం (Travels Bus) జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD09 N9490) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు వద్ద ఒక బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా, అత్యవసర ద్వారం పగలగొట్టి 12 మంది బయటపడగలిగారు. వారిని నెల్లూరులోని జీజీహెచ్ దవాఖానకు తరలించారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలను పోలీసులు వెల్లడించారు.. అశ్విన్ రెడ్డి(36), జీ. ధాత్రి (27), కీర్తి (30), పంకజ్ (28), యువన్ శంకర్ రాజు (22), తరుణ్ (27), ఆకాశ్ (31), గిరిరావు (18), బున సాయి (33), గణేశ్ (30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41), రమేశ్ (30), అనూష (22), మహ్మద్ ఖైజర్ (51), దీపక్ కుమార్ (24), అన్డోజ్ నవీన్ కుమార్ (26), ప్రశాంత్ (32), ఎం సత్యనారాయణ (28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), సూర్య (24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస్‌రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కే. అశోక్ (27), ఎంజీ రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్ కుమార్ (18), వేణుగోపాల్ రెడ్డి (24), రమేశ్ అని వ్యక్తితోపాటు అతని ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో 39 మంది పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం నుంచి బయపడిన వారిలో 19 మందిని గుర్తించామని, వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు.
ప్రమాదం నుంచి బయటపడినవారు..
సత్యనారాయణ (సత్తుపల్లి), జైసూర్య (మియాపూర్), నవీన్‌కుమార్ (హయత్‌నగర్), సరస్వతి హారిక (బెంగళూరు), నేలకుర్తి రమేశ్ (నెల్లూరు), కటారి అశోక్ (రంగారెడ్డి జిల్లా), ముసునూరి శ్రీహర్ష (నెల్లూరు), పూనుపట్టి కీర్తి (హైదరాబాద్), వేణుగోపాల్‌రెడ్డి (హిందూపురం), రామిరెడ్డి (ఈస్ట్ గోదావరి), లక్ష్మయ్య, శివనారాయణ (డ్రైవర్లు).
కాగా, నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ బంధువులు ప్రమాద స్థలానికి వచ్చారు. రమేశ్ (35) సహా అతని కుటుంబ సభ్యులు అనూష (30), మన్విత (10), మనీశ్ (12) చనిపోయారు.