హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల (Private Travels Bus) ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఫిట్నెస్ ఉండదు. ఇన్సూరెన్స్ ఉండదు. పొల్యూషన్ సర్టిఫికెట్ అసలే ఉండదు. ఎక్కడో రిజిస్ట్రేషన్ అవుతాయి. మరెక్కడో తిరుగుతాయి. అనుమతి పొందేది ఒకరూట్లో అయితే తిప్పేది మరో రూట్లో. అనుభవం లేని డ్రైవర్లు. స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ అడ్డగోలుగా దోచుకుంటారు. ఇక పండుగలప్పుడు టికెట్ల ధరలు చెప్పాల్సిన పనేలేదు. నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా రవాణా శాఖ అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ పట్టించుకోవు. పండుగల పూట తప్ప ప్రైవేటు బస్సులను తనిఖీ చేసే మానుడే ఉండడు. ప్రమాదాలు జరిగినప్పుడు నానా హంగామా చేసి, జనాలు మరిచిపోయిన తర్వాత ఇదంతా షరా మామూలే నని మిన్నకుండిపోతారు.
తాజాగా కర్నూలు జరిగిన ప్రైవేటు బస్సు కాలిబూడిదైన ఘటన దీనికి మంచి ఉదాహరణ. హైదరాబాద్, బెంగళూరు మధ్య నడుస్తున్న ఓల్వో స్లీపర్ బస్సు (DD01N9490) కావేరి ట్రావెల్స్ పేరుతో వేమూరి వినోద్ కుమార్ వ్యక్తి నడుపుతున్నారు. దీనిని డయ్యూ డామన్‌లో రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత ఒడిశాలోని రాయగడ ఆర్టీవోకి బదిలీ చేసి ఆల్ఇండియా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ పొందారు. నడిపేది మాత్రం బెంగళూరు, హైదరాబాద్ మార్గంలో. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎక్కడో రిజిస్టర్ చేయడం, మరెక్కడో నడపడం అనేది పెద్ద దందా!. మన దగ్గర నిబంధనలు అనుమతించని బస్సులు వేరే రాష్ట్రాల్లో అనుమతి పొంది.. ఇక్కడికి తీసుకొచ్చి నడుపుతూ ఉంటారు. రవాణా శాఖ కళ్లు మూసుకున్నంత కాలం ఇవి ఇలాగే జరుతూనే ఉంటాయి. ఇంకెందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.