BC Reservations | కురవి, ఫిబ్రవరి 07 : కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం.. తెలంగాణలో చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బండారు వెంకటరమణ డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. తీర్మానం చేయకుంటే.. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కోసం ఏ విధంగానైతే రైతులు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో వేలాది నామినేషన్లు వేసి నిరసన వ్యక్తం చేశారో.. అదే రీతిలో రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలంతా ఏకమై ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది నామినేషన్లు వేసి పెనుసంచలనం సృష్టిస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరిట బీసీల శాతాన్ని తగ్గించి, బీసీలను రాజకీయంగా సమాధి చేసే మోసపూరిత ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీలందరూ 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని స్పష్టం చేశారు. బీసీలను మోసం చేయాలని చూసే ఏ పార్టీకి అయిన బీసీల బలమేంటో చూపుతాం. ఓటు ద్వారానే సమాధి చేస్తాం. బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాక విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు.
రాబోయే రోజుల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులగణన వలన కలిగిన నష్ట నివారణకు కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే రిజర్వేషన్లు సాధించే వరకు దీర్ఘకాలీక ప్రణాళికలను తయారుచేస్తాం. గతంలో 51 శాతం ఉన్న బీసీలు 46 శాతానికి ఎలా తగ్గిపోయారో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అగ్రకులాల వారు పెరుగుతారు. బీసీలు మాత్రమే తగ్గుతారా. అగ్రకులాలను కాపాడేందుకే ప్రభుత్వం సర్వే చేసినట్లుంది. ఇప్పటికైనా తిరిగి సర్వే చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. బీసీలు ఏకమైతే ఎవరు తట్టుకోలేరు అని బండారు వెంకటరమణ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Suicide | ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ వ్యవహారం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు
MLC Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు