Awaaz FM 90.4 | ఆ రేడియో గ్రామీణుల గొంతుక. సామాన్య మహిళలే రేడియో జాకీలు. సాధారణ గృహిణులే యాంకర్లు. పల్లెపడుచులే గాయనీమణులు. అనుభవ సంపన్నులైన వయోధికులే కౌన్సెలర్లు. అచ్చమైన మట్టి మనుషుల వేదిక.. ఆవాజ్ వనపర్తి.. 90.4 ఎఫ్ఎం. ఈ కమ్యూనిటీ రేడియో ఆన్లైన్లోనూ ‘హలో.. హలో’ అంటూ హల్చల్ చేస్తున్నది.
పొద్దున్నే సుప్రభాతం. ఆ తర్వాత భక్తి గీతాలు. కొంతసేపటికి వార్తలు. ఆసక్తి ఉంటే సంస్కృత పాఠాలు. ఇంకా, రైతన్నలకు సాగు సలహాలు.
.. ఒకటిరెండు తరాల క్రితం వరకూ రేడియో ఇంట్లో ఓ భాగంగా ఉండేది. కుటుంబానికి కాలక్షేపం అయ్యేది. టీవీ వచ్చాక ఆ ఠీవి కనుమరుగైంది. స్మార్ట్ఫోన్లతో పరిస్థితి మరింత దిగజారింది. కానీ, రేడియో రేడియోనే! బుల్లిపెట్టె ప్రత్యేకతే వేరు. కాబట్టే, ‘ఆవాజ్ వనపర్తి’ లాంటి కమ్యూనిటీ రేడియోలు జనం అభిమానాన్ని చూరగొంటున్నాయి. ‘సంఘం రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే.. అందరూ బాగున్నారా..’ అంటూ ఉదయం ఎనిమిది గంటలకంతా ‘ఆవాజ్ వనపర్తి’ ఆత్మీయ స్వరం వినిపిస్తుంది. మధ్యాహ్నం వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత అవే పునః ప్రసారం అవుతాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆవాజ్ వనపర్తి 90.4 ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘రేడియో గార్డెన్’ వెబ్సైట్ లోనూ వినొచ్చు. గోపాల్పేట మండలం, తాడిపర్తి శివారులోని టవర్ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 150 గ్రామాలకు (40 కిలోమీటర్ల దూరం మేర) రేడియో కేంద్రం సేవలు అందుతున్నాయి.
Awaaz 90.4fm2
వనితాజ్యోతి మహిళా సంఘం, టీఎస్ఎన్జీవో ఆధ్వర్యంలో ఆవాజ్ వనపర్తి రేడియో కేంద్రం నడుస్తున్నది. 2020 ఫిబ్రవరి 10న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కమ్యూనిటీ రేడియో ఆరంభమైంది. ఒక్క వెబ్ రేడియో ద్వారానే వివిధ దేశాల నుంచి దాదాపు 2 లక్షల మంది ప్రసారాలను వింటున్నట్టు స్టేషన్ నిర్వాహకురాలు ఖమ్మర్ రెహమాన్ తెలిపారు. ‘ఆవాజ్ వనపర్తి’లో రోజూ ఆణిముత్యాల్లాంటి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ‘మంచి మాట’లో విద్య, వైద్యం, మహిళల భద్రత, సామాజిక సమస్యలు తదితర అంశాలు చర్చకు వస్తాయి. సేద్యం గురించీ ముచ్చటిస్తారు. ఇది ఇరవై నిమిషాల కార్యక్రమం. ఆరోగ్య చిట్కాలు, వంటింటి వైద్యంపై పది నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. ‘మన పాట-మంచి పాట-వనపర్తి పాట’ జానపద కళాకారులను ప్రోత్సహించే వేదిక. ఈ కార్యక్రమం నిడివి 30 నిమిషాలు. ‘మనసులో మాట’లో తీపి జ్ఞాపకాలు, యధార్థ సంఘటనలు, చారిత్రక ప్రదేశాల గురించి ఓ పది నిమిషాలు చర్చిస్తారు. ప్రతి ఆదివారం ‘ఆవాజ్ చిల్డ్రన్’ అనే స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. రేడియోలో ప్రసారమైన అనేక కార్యక్రమాలు జనాదరణ పొందాయి, పొందుతున్నాయి. ఆ స్ఫూర్తితో తమను తాము తీర్చిదిద్దుకున్నవారూ ఉన్నారు. ‘ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలు మా రేడియో సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ఇదో మంచి అవకాశం. సాధారణ మహిళలు సైతం తమ గొంతు వినిపించవచ్చు. మాటలు, పాటలతో ప్రేక్షకులను అలరించవచ్చు. దీనివల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సంభాషణ నైపుణ్యం మెరుగుపడుతుంది. బిడియం పోతుంది’ అని పిలుపునిస్తున్నారు ఖమ్మర్.
Awaaz 90.4fm1
వనపర్తి గాంధీచౌక్ ప్రాంతంలో ఉంటారు ఖమ్మర్ రెహమాన్. తమ ఇంటి పై అంతస్తులో రేడియో స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఖమ్మర్ది బాల్య వివాహం. భర్త పేరు రహీమ్. అప్పటికి తను పదో తరగతి వరకు చదువుకున్నారు. పెద్ద చదువులు చదవాలని కోరిక. ఆ ప్రయత్నంలో భర్త ప్రోత్సహించారు. దీంతో ఖమ్మర్ పట్టుదలతో డిగ్రీ చేశారు. తనలాగే బాల్య వివాహాలు చేసుకున్నవారికి అన్ని విధాలా సాయం చేయాలనే ఉద్దేశంతో ‘వనితాజ్యోతి మహిళా సంఘం’ స్థాపించారు. సంఘం ఆధ్వర్యంలో 400 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ సెంటర్ (సీఐఆర్సీ) ద్వారా నాలుగు వేల మందికి ఉచితంగా కుట్టుపని నేర్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థినులకు స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇప్పించారు. ఆ సేవలకు గుర్తింపుగా.. మహిళా దినోత్సవంనాడు గవర్నర్ చేతుల మీదగా అవార్డు కూడా అందుకున్నారు ఖమ్మర్ రెహమాన్.
పి.రాము
Awaaz 90.4fm