HYDRAA | హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత.. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన సూచించారు. మూసీ, హైడ్రాపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఏవీ రంగనాథ్ మాట్లాడారు.
కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పని చేస్తుందని కితాబిచ్చారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేశాం.. దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదు. ప్రజలు నివసిస్తున్న భవనాలను అసలు కూల్చలేదు. ఇటీవల కూకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణలను కూల్చేశాం. ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశాం అని రంగనాథ్ పేర్కొన్నారు.
అమీన్పూర్లో ప్రభుత్వం భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయి. అమీన్పూర్లో గతంలో ఓ హాస్పిటల్‌ను కూల్చినా మళ్లీ నిర్మించారు. అమీన్పూర్లో హాస్పిటల్‌ను కూల్చేశారని ప్రచారం చేస్తున్నారు. అమీన్పూర్లో కూల్చిన ఆస్పత్రిలో రోగులెవరూ లేరు.. వీడియో రికార్డు కూడా చేశాం అని పేర్కొన్నారు.
హైడ్రా మీద భయంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి చాలా బాధపడ్డాను. బుచ్చమ్మను కొందరు భయపెట్టారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత.. దీనిని బూచిగా చూపించొద్దు. సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూల్చివేస్తున్నాం. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు చెరువులు, నాళాలను కాపాడుకోలేం అని రంగనాథ్ తెలిపారు.
పరిశుభ్రమైన వాతావరణం అనేది రాజ్యాంగంలో భాగం. పరిశుభ్రమైన వాతావరణం జీవించే హక్కులో భాగం. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదు. అసదుద్దీన్ ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయి. విద్యా సంవత్సరం నష్టపోతుందనే వాటిపై చర్యలు తీసుకోలేదు. అక్రమ కట్టడాలపై వెనుక పెద్దవాళ్లు ఉన్నారని రంగనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మూసీలో రక్తం పారించాలనుకుంటున్నావా..? రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
Gandhi Bhavan | కాంగ్రెస్‌ను వెంటాడుతున్న మూసీ బాధితుల భయం.. గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు
Suryapet | 50 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. మా ఇండ్లు కూల్చొద్దు