Suryapet | బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపుతున్నది. చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు సర్వే చేస్తుండడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. గురువారం పలు కాలనీలకు వచ్చిన సర్వే అధికారులకు ప్రజల నుంచి ఎదురు దాడి రావడంతో వెనుదిరిగి వెళ్లారు. కాంగ్రెస్ సర్కారు హైడ్రా హైదరాబాద్‌కే పరిమితమని మొదట చెప్పి ఇప్పుడు జిల్లాలకు తీసుకొస్తున్నది. దాంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏండ్లుగా ఆయా చెరువుల సమీప ప్రాంతాల్లో నివాసముంటున్నామని, ఇంటి నంబర్ ఉన్నదని, మున్సిపాల్టీకి పన్ను కడుతున్నామని, ఇన్నేండ్లు సర్వేకు రాని అధికారులు ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. హైడ్రా తీసుకొచ్చి రేవంత్ సర్కారు పేదల నోట్లో మట్టి కొడుతున్నదని మండిపడుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువు, నల్ల చెరువు ప్రాంతాల్లో అధికారులు చేస్తున్న సర్వేలతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సద్దుల చెరువు సమీప ప్రాంతాల్లో 200 ఇండ్లను సర్వే చేశారు. ఆయా ప్రాంతాల్లో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారుల భాగస్వామ్యంతో సర్వే చేపడుతున్నారు. సర్వే చేస్తున్న అధికారులు ఇంటి నంబర్, ఓనర్ పేరు, ఇల్లు స్వభావం అడిగి తెలుసుకుంటుండడంతో వివరాలు చెప్పకుండా ప్రజలు నిలదీస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారుల బృందం సర్వే పంథాను మార్చింది. ప్రస్తుతం జనావాసాల్లోకి రాకుండా చెరువు శిఖాల్లో, నివాసాలు లేని ప్రాంతాల్లో సర్వేను కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారి వెంట సద్దుల చెరువులో కట్టడాలను పరిశీలించారు. సద్దుల చెరువు సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్ వద్ద ఉన్న చెరువు హద్దు రాయిని గుర్తించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 268 ఎకరాల్లో విస్తరించి ఉన్న సద్దుల చెరువు 247, 800 సర్వే నంబర్ల పరిధిలోకి వస్తుంది. పలు సర్వే నంబర్లలో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఉన్నాయి. సద్దుల చెరువు చుట్టు పక్కల 13, 14, 28, 29, 30, 41, 42, 43 వార్డుల్లో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకోగా 30, 42, 43వ వార్డుల్లో అధికంగా ఎఫ్టీఎల్ పరిధిలో నివాసాలు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
హైడ్రా కలకలంతో చెరువుల పరిధిలోని ప్రజలు ఆందోళనలో పడ్డారు. ‘మాది చెరువుకు ఇంత దూరంలో ఉంది..అంత దూరంలో ఉంది.. హైడ్రాలో మాది పోతుందా.. మాది పోతుందా? అని చర్చించుకుంటున్నారు. చెరువు నీళ్ల నుంచి 30 మీటర్ల వరకు ఎఫ్టీఎల్, ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ అని అధికారులు చెప్తుండడంతో తమ ఇండ్లు ఆ పరిధిలో లేవని కాలనీవాసులు చెప్తున్నారు.
హైడ్రా సర్వేతో నెహ్రూనగర్, శ్రీశ్రీనగర్, ఇందిరాకాలనీలకు చెందిన ప్రజలు పెద్దఎత్తున సమావేశమై కలెక్టరేట్ వద్దకు వెళ్లి ధర్నా చేశారు. అధికారులు సర్వే నిలిపివేయాలని, తమ ఇండ్లను కూల్చితే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా సర్వే నిర్వహిస్తుండడంతో ఇంట్లో పొయ్యి రాజేయడం లేదని, కడుపునిండా తిండి, కంటి నిండ నిద్రకు దూరమై బాధపడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండేదని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే పేదల గూడును కూలదోస్తున్నారని మండిపడ్డారు. ‘మాకు ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలు వద్దు.. మా గూడు మాకు ఉంచితే చాలు’ అని వేడుకుంటున్నారు.
నా చిన్ననాటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం. కూలి నాలి చేసుకొని ఇండ్లు కట్టుకున్నాం. చెరువు నిండు కుండలా ఉన్న నాడు కూడా మా ఇండ్లు మునగలేదు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ట్యాంక్‌బండ్ కట్టించినప్పుడు కూడా మా జోలికి రాలేదు. 40సంవత్సరాలుగా ఉంటున్నాం, మమ్మల్ని చంపి మా ఇల్లు కూల్చాలి. వయసు పెరుగుతుండడంతో ఇల్లు పోతే ఇప్పుడు మేము ఎటు పోవాలి. ఇంత మందికి ఎక్కడ అద్దెలకు ఇండ్లు దొరుకుతాయి. వచ్చిరాని ప్రభుత్వం వచ్చి మా ఇండ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదు.
– గుంజ జానకమ్మ, శ్రీశ్రీనగర్, సూర్యాపేట
50 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం. నాకు భర్త లేడు. కూలి పనిచేస్తూ చిన్న చిన్న పిల్లలను సాదుకుంటూ ఉన్న ఈ చిన్న గూడుతో జీవనం సాగిస్తున్నాను. కేసీఆర్ సార్ ఉన్నన్ని రోజులు మాకు ఏ ఇబ్బందులు లేవు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిండు తప్ప ప్రజల నోటికాడి కూడు గుంజలేదు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాకు ఏమి ఇవ్వకపోగా గూడు కూడా లేకుండా చెయ్యాలని చూస్తుండు. పస్తులున్నా మా ఇంట్లో మేము ప్రశాంతంగా పడుకునేవాళ్లం. కానీ ఇండ్ల కూల్చే కుట్రలు వద్దు.
– రేణుక, నెహ్రూనగర్, సూర్యాపేట
మా అత్త మామల కాలం నుంచి సుమారు 60 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇవాళ పోవాలంటే ఎక్కడికి పోవాలి. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదు. నా కుమారుడు చనిపోయిండు. ఎప్పుడూ మా ఇండ్లకు నీళ్లు రాలేదు. కట్ట కట్టిన తరువాత ఇప్పుడు నీళ్లు ఎలా వస్తాయి. తిండి తిప్పలు లేకుంగా వారం రోజులుగా భయంతో చస్తున్నాం. మేం చావాలంటే చెప్పండి. ఒక్కసారే అందరికి విషం సీసాలు ఇచ్చి చంపండి. మంచాన పడ్డ నా భర్తను తీసుకొని ఎక్కడికి పోవాలి ఈ వయసులో. కిరాయిలు కట్టి మేం ఉండలేము. పెద్దలు, నాయకులు మా సమస్యకు పరిష్కారం చూపాలి.
-మక్కల లక్ష్మీశ్రీరాములు, సూర్యాపేట
భర్త అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిండు. ఇల్లు కూలగొడుతున్నారని సమాచారం తెలుసుకొని హైదరాబాద్ నుంచి నా భర్తను అక్కడే వదిలేసి రాత్రికి రాత్రే వచ్చాను. పది లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కట్టాను. ఆరేండ్లుగా లోన్ కడుతున్నా. ఇంకా తొమ్మిదేండ్లు కట్టాల్సి ఉంది. నేను ఏమి చేయాలి. నా పిల్లను ఏం పెట్టి సాదుకోవాలి. నా అరగుంట ఇల్లు తీసేస్తే ఆరోగ్యం బాగా లేని నా భర్తను ఎక్కడికి తీసుకుపోవాలి. ప్రజాప్రతినిధులకు, అధికారులకు దండం పెడుతున్నా.మమ్మల్ని కనికరించి మా ఇల్లులు మాకే ఉంచండి.
– శోభ, నెహ్రూనగర్, సూర్యాపేట
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయంతో సద్దుల చెరువు సమీప ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నాం. పాత కాలంలో సద్దుల చెరువు ఎఫ్టీఎల్ పరిధి హద్దుల ప్రకారం కట్ట కట్టిన తరువాత కట్ట ఇవతల ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ని నివాసాలు ఉన్నాయో సర్వే చేస్తున్నాం. ఈ సర్వేలో ఇంటి నంబర్, ఓనర్ పేరు, ఇల్లు స్వభావం నమోదు చేస్తున్నాం. కేవలం సర్వే మాత్రమే చేయమని చెప్పారు తప్ప కూలగొట్టమనే ఆదేశాలు లేవు. ఇప్పటి వరకు 200 ఇండ్లను సర్వే చేశాం. ప్రజలు ఏదేదో ఊహించుకొని భయపడి ఎదురుదాడికి దిగుతుండడంతో సర్వే ముందుకు సాగడం లేదు.
-భూక్యా పాండునాయక్, ఇరిగేషన్ ఏఈ, సూర్యాపేట