Chandrababu | హైదరాబాద్ : దావోస్ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పర్యటన అంశాలు, పెట్టుబడుల వివరాలను చంద్రబాబు వివరించారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే.. ‘దావోస్ అంటే అందరికి ఒక భ్రమ ఉంది. ఎన్ని ఎంవోయూలు చేశారు..? ఎంత డబ్బులు వచ్చాయి..? ఇది ఒక భ్రమ. అంటే ఇన్ ది సెన్స్.. ఇక్కడ ఉండే ఎంవోయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ప్లేస్ ఫర్ నెట్ వర్కింగ్’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు పేర్కొంటున్నారు. రేవంత్ పరిపాలనను హేళన చేసే విధంగా చంద్రబాబు సెటైర్లు వేశారని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
ఎందుకంటే.. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పందం చేసుకున్న మూడు కంపెనీలూ హైదరాబాద్‌కు చెందినవే. మన రాష్ట్ర రాజధానిలో కొలువైన కంపెనీలే.. మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయన్నమాట. అదీ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో. ఆయా కంపెనీల ప్రధాన కార్యాయాల నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయంలో చేసుకోవాల్సిన ఒప్పందాలు.. ఏడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దావోస్‌లో ఎందుకు జరిగాయని సోషల్‌మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
దావోస్ పర్యటనలో భారీగా పెట్టుబడులు సాధించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాపత్రయపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కే చెందిన కంపెనీలతో స్విట్జర్లాండ్‌లో ఎంవోయూలు చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. వాస్తవానికి డబ్ల్యూఈఎఫ్ వేదికగా తెలంగాణలో ఉన్న అవకాశాలను దేశ, విదేశీ కంపెనీలకు పరిచయం చేసి, చర్చలు జరిపి, పెట్టుబడులు సాధించాల్సి ఉంటుంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలను తెలంగాణకు ఆకర్షించేలా ప్రజంటేషన్ ఇవ్వాలి. అలాంటిది హైదరాబాదీ కంపెనీలకు కొత్తగా తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. ఈ తతంగం మొత్తం ఇక్కడే పూర్తి చేయొచ్చని, కేవలం సొంత ప్రచారం కోసమే డబ్ల్యూఈఎఫ్ను వేదికగా చేసుకున్నారని ఆరోపించారు. మేఘా రూ.15వేల కోట్లు, కంట్రోల్ ఎస్ సంస్థ రూ.10 వేల కోట్లు, స్కైరూట్ రూ.500 కోట్లు.. మొత్తంగా మూడు కంపెనీలు కలిపి రూ.25,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఎంవోయూలను దృష్టిలో ఉంచుకునే ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించి ఉంటారని విశ్లేషకులు, ఐటీ ఉద్యోగులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంత ఘోరంగా పరువు తీసుకుంటారా..? అని రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పరిపాలనలో మార్పులు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనపై సెటైర్లు వేయడమంటే.. రేవంత్ రెడ్డి పాలన ఏంటో తెలిసిపోతోందని.. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ నవ్వుల పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర పౌరులు.
ఇండియాలో ఉండే కంపెనీలతో దావోస్ వెళ్లి ఎంఓయు చేసుకోవాల్సిన అవసరం లేదు – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు pic.twitter.com/eAFfvIfAnh
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
ఇవి కూడా చదవండి..
Jagitial | బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షం.. ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు సమాధానం..
Nagarkurnool | విద్యార్థినులు నవ్వారని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు..
Minister Seethakka | డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. Video