జోగులాంబ గద్వాల్ : గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో కొద్ది రోజులు క్రితం పార్క్ చేసిన కారులోంచి నగదు ఎత్తుకెళ్లిన(Cash stealing) కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల్‌లోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భాగ్యలక్ష్మి హోటల్ ముందు పార్క్ చేసిన కారులోంచి 3,60,000 రూపాయాల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దీంతో బాధితుడు గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ మేరకు శనివారం ఎర్రవల్లి చౌరస్తాలో గద్వాల్ టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 3,10,000 రూపాయాల నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అలాగే జిల్లాలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి 6,00,000 డబ్బులు వసూలు చేసిన అంకితను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్ రావు అభినందించి వారికి రివార్డులు అందజేశారు.