చండీగఢ్: పంజాబ్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో (Punjab Bypolls) ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లీడ్‌లో ఉన్నది. ఒక స్థానంలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తున్నది. నలుగురు ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో పంజాబ్‌లోని గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్ (ఎస్సీ), బర్నాలా సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. నవంబర్ 20న ఈ నాలుగు స్థానాలకు పోలింగ్ జరిగింది.
కాగా, శనివారం నాటి కౌంటింగ్‌లో గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్ స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. గిద్దర్‌బాహాలో ఆప్‌కు చెందిన హర్దీప్ సింగ్ డింపీ ధిల్లాన్ సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అమృతా వారింగ్‌పై ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ భార్య అయిన అమృతా వారింగ్, బీజేపీ అభ్యర్థి, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ తర్వాత స్థానాల్లో నిలిచారు.
మరోవైపు డేరా బాబా నానక్‌లో ఆప్ అభ్యర్థి గుర్దీప్ సింగ్ రంధావా, కాంగ్రెస్ అభ్యర్థి జతీందర్ కౌర్ రంధావా మధ్య పోటీ నెలకొన్నది. తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ తర్వాత గురుదాస్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా భార్య అయిన కాంగ్రెస్ అభ్యర్థినిపై ఆప్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి చెందిన రవికరణ్ కహ్లాన్ మూడో స్థానంలో నిలిచారు.
కాగా, చబ్బేవాల్లో తొమ్మిదో రౌండ్ కౌంటింగ్ తర్వాత ఆప్ అభ్యర్థి ఇషాంక్ కుమార్ చబ్బేవాల్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ కుమార్‌పై ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సోహన్ సింగ్ తాండల్ మూడో స్థానంలో నిలిచారు.
ఇక బర్నాలా సెగ్మెంట్లో తొలుత ఆప్ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పుంజుకున్నది. పది రౌండ్ల కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ సింగ్ ధిల్లాన్ ఆప్ అభ్యర్థి హరీందర్ సింగ్ ధాలివాల్‌పై ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి చెందిన కేవల్ సింగ్ ధిల్లాన్ మూడో స్థానంలో ఉన్నారు.