Protein Fruits | ప్రోటీన్లు ఉండే ఆహారాలు అంటే సహజంగానే చాలా మందికి పప్పు దినుసులతోపాటు చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఆహారాలు గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు మనకు అందే స్థూల పోషకాల జాబితాకు చెందుతాయి. అంటే వీటిని ఎక్కువ మొత్తంలో రోజూ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందులో భాగంగానే చాలా మంది పప్పు దినుసులతోపాటు నట్స్, నాన్ వెజ్ వంటలను తరచూ తింటుంటారు. వీటిని తింటే మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. అయితే మీకు తెలుసా.. కొన్ని రకాల పండ్లలో కూడా మనకు ప్రోటీన్లు లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకున్నా మనం ప్రోటీన్లను పొందవచ్చు. ప్రోటీన్లు మనకు రోజుకు ఒక కిలో బరువుకు 0.8 గ్రాముల మేర అవసరం అవుతాయి.
అంటే సుమారుగా 50 కిలోలు ఉన్న వ్యక్తి 40 గ్రాముల మేర ప్రోటీన్లను రోజూ తినాల్సి ఉంటుందన్నమాట. ఇక మనకు ప్రోటీన్లు అధిక లభించే పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. జామ పండ్లలో ప్రోటీన్లు సమృద్ధిగానే ఉంటాయి. ఒక మీడియం సైజ్ జామ పండును తినడం వల్ల మనకు సుమారుగా 4.2 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. దీంతోపాటు జామ పండ్లలో విటమిన్ సి కూడా సమృద్ధిగానే ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కనుక జామ పండ్లను తింటుంటే ప్రోటీన్లు మనకు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే పనస పండ్లలోనూ ప్రోటీన్లు అధికంగానే ఉంటాయి. ఒక కప్పు పనస పండ్లను తినడం వల్ల మనకు సుమారుగా 2.8 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఈ పండ్లలో పొటాషియం, విటమిన్ బి6 కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి కండరాల పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడును యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక పనస పండ్లను కూడా మనం తరచూ తినవచ్చు.
కివీ పండ్లను తినడం వల్ల కూడా మనం ప్రోటీన్లు పొందవచ్చు. ఒక కప్పు కివీ పండ్లను తినడం వల్ల మనకు సుమారుగా 2.1 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఈ పండ్లలో ప్రోటీన్లతోపాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కివీ పండ్లను తింటే మన శరీరంలో పలు ఎంజైమ్లు సైతం ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఒక కప్పు దానిమ్మ గింజలను తినడం వల్ల మనకు సుమారుగా 1.5 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. దానిమ్మ పండ్లను కూడా ప్రోటీన్లకు మంచి వనరుగా చెప్పవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల అనేక యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక కప్పు అరటిపండును తింటే మనకు సుమారుగా 1.3 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అరటి పండ్లు మనకు తినేందుకు అనువుగా ఉంటాయి. వీటి ద్వారా మనకు అనేక పోషకాలు సైతం లభిస్తాయి. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం.
ఒక కప్పు చెర్రీ పండ్లను తినడం వల్ల మనకు సుమారుగా 1 గ్రాము మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఈ పండ్లను తింటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. రోజూ ఈ పండ్లను తినడం వల్ల మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా పలు రకాల పండ్లను తినడం వల్ల కూడా మనం ప్రోటీన్లను పొందవచ్చు. ప్రోటీన్లు పొందాలంటే కేవలం నాన్ వెజ్ ఆహారాలను మాత్రమే తినాల్సిన పనిలేదు.