DK Shiva Kumar : కర్ణాటక రాష్ట్రంలో ఇక నుంచి మత రాజీకీయాలు ఉండవని, కేవలం అభివృద్ధి రాజకీయాలే ఉంటాయని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ‘ఉప ఎన్నికల ఫలితాలపై మీ స్పందన ఏమిటి..?’ అని మీడియా ప్రతినిధులు డీకే శివకుమార్ ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ.. రాష్ట్రంలోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే లీడింగ్‌లో ఉన్నారని చెప్పారు. బీజేపీ చేసిన తప్పుడు ఆరోపణలు చచ్చిపోయాయని, ఇప్పుడు కేవలం అభివృద్ధి మాత్రమే జీవంతో ఉన్నదని అన్నారు.
ఈ ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్‌లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందనడానికి నిదర్శనమని డీకే చెప్పారు. తాము 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపించబోతున్నామని రాష్ట్ర ప్రజలు సందేశం ఇచ్చారని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలో మత రాజకీయాలకు తావు లేదని, కేవలం అభివృద్ధి రాజకీయాలే ఉంటాయని పేర్కొన్నారు.