కరీంనగర్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్తే.. వచ్చిన దిగుబడులను అమ్మేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా.. కొనుగోళ్లలో జాప్యం చేస్తుండడంతో రైతులు రోజుల కొద్దీ పడిగాపులు గాస్తున్నారు. వాతావరణం మారినప్పుడల్లా భయంతో వణికిపోతున్నారు. రోజూ ఎండ రాగానే ఆరబోస్తూ, నల్లని మబ్బులు పడితే చాలు పరదాలు కప్పుతూ కాపాడుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా మొంథా తుపాను కారణంగా పడిన వర్షాలతో నిండా మునిగారు. కల్లాల్లో ఉంచిన వడ్లు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యం తడిసిపోవడం చూసి కంటతడి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరుచుకోకపోవడం.. కొనుగోళ్లలో జాప్యం కావడం.. వాతావారణ శాఖ హెచ్చరికలు చేయడం చూసి ఇంకా ఎన్నిరోజులు పడిగావులు పడాల్సి వస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తూ.. అడ్డికి పావుశేరు అన్నట్టు తెగనమ్ముకుంటున్నారు. క్వింటాల్‌కు ఐదారు వందల చొప్పున నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రోడ్డెక్కి, సర్కారు తీరుపై నిరసన తెలుపుతున్నారు. సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్లే తాము నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా, అన్నదాతలకు ధీమాను కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు.

సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 31: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలవుతున్నది. సరైన సమయంలో ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడం.. భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఆందోళన చెందిన రైతులు చేసేదేమీ లేక అగ్గువకు అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న దళారులు క్వింటాల్‌కు 1700 నుంచి 1800కే కొనుగోలు చేస్తుండగా, రైతులు క్వింటాల్‌కు 500 నుంచి 700 వరకు నష్టపోతున్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పలువురు రైతులు రోడ్డుపైనే కాంటా పెట్టి దళారులకు విక్రయించారు.
మానకొండూర్ రూరల్, అక్టోబర్ 31: రంగపేట ఐకేపీ సెంటర్లో దొంగలుపడ్డారు. ధాన్యాన్ని తరలించే క్రమంలో అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్లే.. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో మానకొండూర్ మండలం రంగపేట శివారు పొలాల్లో ధాన్యం కుప్పలను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాదాపు 20 సంచుల్లో ధాన్యాన్ని నింపి వాహనంలో తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆ దొంగలను రైతులు గుర్తించారు. ఇద్దరు దొంగల్లో ఒకరు పారిపోగా, మరో వ్యక్తి మానకొండూర్‌కు చెందిన జహీద్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్టు సీఐ సంజీవ్ తెలిపారు.

సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 31 : బాణప్ప చెరువు మత్తడి తెగి తాము పంటలు నష్టపోయామని, పరిహారం చెల్లించాలని తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇల్లంతకుంట మండలం దాచారం శివారులో ఉన్న బాణప్ప చెరువు సమీపంలోని రామచంద్రాపూర్ రైల్వే లైన్ కట్టపై బైఠాయించి ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో బాణప్ప మత్తడి తెగిందని మండిపడ్డారు. దీంతో తాము పంటలు నష్టపోయామని వాపోయారు. పొల్లాల్లో కొట్టుకొచ్చి పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాలని, బాణప్ప చెరువుకు శాశ్వత మత్తడి కట్టించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పొన్నాల చక్రపాణి, బొడ్డు శ్రీధర్, గడ్డం భాస్కర్‌రెడ్డి, గంధం శ్రీనివాస్, పొన్నాల సురేశ్, గంధం రమేశ్, సందీప్, కొమ్ము పర్శరాములు, సుజాత, బాలయ్య, చంద్రయ్య, బాలమల్లు, మహేశ్, రాజు, కిష్టయ్య, పరంధాములు పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 31 : తంగళ్లపల్లి మండలం చింతలపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదని రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. పదిహేను రోజులుగా కేంద్రంలోనే ధాన్యం ఉందని, తేమ శాతం 17 వచ్చినా కాంటా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బార్దాన్లు లేవని, వచ్చే వరకు ఆగాలని చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా తమ ధాన్యాన్ని కాంటా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం రజితను సంప్రదించగా, కేంద్రంలో బార్దాన్లు ఉన్నాయని, ఈ కేంద్రానికి సప్తగిరి రైస్‌మిల్ కేటాయించారని, మిల్లర్ ధాన్యం తీసుకురావద్దని చెప్పడంతోనే కాంటా పెట్టడం లేదని చెప్పారు. ఇతర మిల్లుకు కేటాయించి, ధాన్యం కొనుగోళ్లు చేపడతామని తెలిపారు.