సిరిసిల్ల రూరల్/అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 31 : ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి దాకా తుఫాన్ ప్రభావంతో పత్తి పాడైపోగా.. వచ్చిన కొద్దిపాటి దిగుబడిని కొర్రీల పేరుతో కొనడంలేదని గగ్గోలు పెడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి హైవే-44పై వరసిద్ధి వినాయక కాటన్ మిల్లుకు నాలుగు రోజులుగా పత్తి లోడ్‌తో వాహనాలు వస్తున్నా.. సీసీఐ అధికారులు మాత్రం తేమ అధికంగా ఉందని కొనుగోలు చేయకుండా వెనక్కి పంపుతున్నారు. శుక్రవారం 20 ట్రాక్టర్లలో పత్తి రాగా.. సగం వరకు కొనుగోలు చేయగా.. మిగతావి తేమ శాతం అధికంగా ఉందని కొనుగోలు చేయలేదు. ఓవైపు ప్రభుత్వ నిబంధనలు, మరోవైపు సీసీఐ అధికారులు ఇష్టానుసారం నడిగడ్డ రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చింతలపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేశారు.
15 రోజులుగా కేంద్రంలోనే ధాన్యం ఉందని, తేమ శాతం 17 వచ్చినా కాంటా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బార్దాన్లు లేవని, వచ్చే వరకు ఆగాలని చెబుతున్నారని వాపోయారు. ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం రజితను వివరణ కోరగా కేంద్రంలో బార్దాన్లు ఉన్నాయని, ఈ కేంద్రానికి సప్తగిరి రైస్ మిల్ కేటాయించారని, మిల్లర్ ధాన్యం తీసుకురావద్దని చెప్పడంతోనే కాంటా పెట్టడం లేదని పేర్కొన్నారు. వేరే మిల్లును కేటాయించి, ధాన్యం కొనుగోళ్లు చేపడతామని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం శివారు బాణప్ప చెరువు మత్తడి తెగడంతో పంట నష్టపోయిన తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్ రైతులు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. బాణప్ప చెరువు సమీపంలోని రైల్వే లైన్ కట్టపై బైఠాయించి, న్యాయం చేయాలంటూ నినదించారు. అధికారుల నిర్లక్ష్యంతో బాణప్ప మత్తడి తెగిందని, దీంతో తాము పంటలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. శాశ్వత మత్తడి కట్టించాలని, పొల్లాల్లో పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాలని డిమాండ్ చేశారు.