హనుమకొండ/వరంగల్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో అతలాకుతలమైన వరద బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఎలాంటి భరోసా ఇవ్వలేదు. సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా కనీస పలకరింపు కూడా కరువైంది. వరద ప్రాంతాల్లో పర్యటన పేరుతో హెలికాప్టర్లో వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు కనీసం ధైర్యమైనా చెప్పలేదు. వరదల నివారణకు శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. ముఖ్యమంత్రి వచ్చారు.. వెళ్లారు అనేలా పర్యటన ఆసాంతం సాగింది. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం హెలికాప్టర్లో వరద ప్రాంతాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ నగరానికి చేరుకున్నారు. వరదలతో నీట మునిగిన సమ్మయ్యనగర్, పోతననగర్‌లో పర్యటించారు. అనంతరం హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌లో అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనలోనూ, సమీక్షలోనూ వరద బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. హడావుడి పర్యటన, మొక్కుబడి సమీక్ష అనంతరం గతంలో చెప్పినట్టుగానే మొక్కుబడిగా ప్రకటనలు చేసి వెళ్లిపోయారు. సీఎం కార్యాలయం ముందుగా ప్రకటించినట్టుగా వరంగల్ నగరంలోని వరద ప్రాంతాల్లో కనీసం దిగి చూడనేలేదు.
ఒక్కచోటే అదీ ముగ్గురు నలుగురితో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ ఒక్కచోట మినహా ఎక్కడా అధికారులతో తప్ప ఎవరితోనూ మాట్లడలేదు. స్వయంగా సీఎం వచ్చాడనే ఆశతో చుట్టుపక్కల ఇండ్లలోని ప్రజలను పలకరించే ప్రయత్నం చేసినా అటువైపు చూడలేదు. సార్, సార్.. అన్నా, అన్నా అని మహిళలు గొంతెత్తి పిలిచినా సీఎం వినిపించుకోలేదు. ప్రతిసారి వరదలు వస్తున్నాయని పోతననగర్‌లోని ప్రజలు దూరం నుంచి గట్టిగా చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. వరదలతో అన్ని కోల్పోయిన తమను సీఎం కలిసి మాట్లాడుతారని ఆశించిన వరద బాధితులకు నిరాశే మిగిలింది. కారులోనే ఉండి చేతులు ఊపుతూ వెళ్లపోయేందుకు హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రావాలా? అని వరద బాధితులు పెదవి విరిచారు. వరదలతో నష్టపోయిన తమను ఆదుకుంటామని మాట సాయమూ చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పబ్లిసిటీ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి వచ్చినట్టుగా ఉన్నదని అంటున్నారు. బుధవారం రోజంతా కురిసిన వానలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీగా నష్టం జరిగింది. వరంగల్ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమ్మయ్యనగర్ వద్ద మున్సిపల్ కార్మికులు విజ్ఞప్తి చేసినా.. మీ సమస్యలు అన్నీ మంత్రి పొంగులేటి చూస్తారు’ అంటూ భరోసా ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్లో రాజకీయ వివక్ష కొట్టొచ్చినట్టు కనపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పరామర్శల పర్యటనలోనూ రాజకీయాలేనా? అనే విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఒక్క కాలనీలోనూ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్లో లేకపోవడంపై ఆయా కాలనీవాసులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కేవలం కాపువాడ, పోతననగర్, సమ్మయ్య కాలనీల్లోనే సీఎం పర్యటించారు. దీంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ నగర్, ఎస్సార్‌నగర్, సాయినగర్‌కాలనీ, గాయత్రీనగర్ సహా పలు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం తమ కాలనీకి వస్తారని అనుకున్నాం కానీ, మొత్తం అటుదిక్కే (వరంగల్ పశ్చిమ నియోజకవర్గం) వచ్చిపోతే ఇటోల్లు (వరంగల్ తూర్పు నియోజకవర్గం) గంగలో కలిసినట్టేనా? అని ఆయా కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుపాన్ ధాటికి చేతికొచ్చిన తమ పంటలు దెబ్బతింటే సీఎం రేవంత్‌రెడ్డి పొలాలవైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమని వరంగల్ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలను సీఎం పర్యటిస్తారని తెలుసుకున్న రైతులు ప్రభుత్వం తమను ఆదుకుంటుందని భావించారు. కానీ, రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. సీఎం ఏరియల్ సర్వే చేసినా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు, నష్టతీవ్రతను అంచనా వేసేందుకు బాధితులైన కొందరు రైతులను కలెక్టరేట్కైనా తీసుకెళ్తారని అంతా భావించారు. కానీ, అదంతా ఏమీలేదన్నట్టుగానే సీఎం పర్యటన ముగియడంతో రైతులు తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎంకు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో చూసి రైతును ఓదార్చే తీరిక సీఎంకు లేదా? అని బీఆర్ఎస్ ప్రశ్నించింది.