హనుమకొండ, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుస్నాబాద్ : ‘నాలాలపై కబ్జాలను తొలగించాలి. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు జారీచేశారు. హనుమకొండ, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హనుమకొండలో ఆయన మాట్లాడారు. తొలుత మాట్లాడిన సీఎం తడబడ్డా అలాగే కొనసాగించడం గమనార్హం. నాలాలో అడ్డంకులను సరిగ్గా తొలగించకపోవడం వల్ల వరంగల్‌లో ఎకువ వర్షం పడిందని సీఎం అన్నారు. నాలాలో అడ్డంకులు ఉంటే వరదలొస్తాయి.. కానీ వానలు వస్తాయంటూ సీఎం అనడంపై అధికారులు సైతం ఆశ్చర్యపయారు. అధికారుల సమన్వయలోపంతో సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పది మంది కోసం పది వేలమందికి నష్టం జరుగుతుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. వరద ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరదల్లో ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలని, ఈ మేరకు వివరాలను సేకరించాలని చెప్పారు. వరదలో మునిగిన ప్రతి ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పంటనష్టం, పశు సంపద నష్టపోయిన వారికి పరిహారం అందించాలని, కలెక్టర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రాంచంద్రూనాయక్ పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో ఆస్తి నష్టం, వరదనీటి పరిస్థితులను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మద్యాహ్నం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హుస్నాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షం, మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం, వరద పరిస్థితులు, నష్టపోయిన పంటల వివరాలను మంత్రి పొన్నం సీఎంకు వివరించారు. భీమదేవరపల్లి మండలంలో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షపాతంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. హుస్నాబాద్ మార్కెట్, అక్కన్నపేట మండలం మోత్కులపల్లి సమీపంలో దంపతుల గల్లంతు, వివిధ ప్రాంతాల్లో తెగిన కల్వర్టులను సీఎం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్ మండలాల్లో జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి పంపాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం.