హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): థర్డ్ వేవ్ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చిన్నారుల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు సిద్ధం చేశామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు బుధవారం హైకోర్టుకు నివేదించారు. సీనియర్ పిల్లల వైద్యనిపుణులతో కమిటీ వేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, మందులు తదితర ముందస్తు ఏర్పాట్ల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇప్పటికే వీరితో చర్చించారని చెప్పారు. ముందస్తుగా 6 వేల పడకలను టీచింగ్ దవాఖానలు, జిల్లా, ఏరియా దవాఖానల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నీలోఫర్ దవాఖాన స్టేట్ నోడల్ సెం టర్గా ఉంటుందని, వెయ్యి పడకలను టెర్షియరీ కేర్ అందించేందుకు ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 130 దవాఖానల్లో 27,141 పడకలు ఉండగా, ఇందులో 10,224 పడకలకు ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ఉందని, కొత్తగా 6 వేల పడకలకు ఏర్పాటు చేయగా, మిగతా పడకలకు త్వరలో ఈ సౌక ర్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు. కొత్తగా 7 మెడికల్ కాలేజీలు, 13 నర్సింగ్ కాలేజీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. హైకోర్టుకు అందించిన నివేదికలోని వివరాలు.. జూన్ 1 నుంచి 21 వరకు రాష్ట్రంలో 24 లక్షల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 2.23 లక్షలు ఆర్టీపీసీఆర్ కాగా, 22.45 లక్షలు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ క్రమంగా త గ్గుతూ జూన్ 21 నాటికి 1.46 శాతానికి పరిమితమైంది. 170 ప్రైవేటు దవాఖానలపై మొత్తం 350 ఫిర్యాదులు రాగా, 22 దవాఖానల కొవిడ్ చికిత్స అనుమతులను ప్రభుత్వం రద్దుచేసింది. హైకోర్టు సూచనతో తిరిగి ఎత్తివేసి, అదనంగా వసూలు చేసిన సొమ్మును బాధితులకు అం దేలా చూసింది. ఇప్పటివరకు 93 లక్షల మం దికి వ్యాక్సినేషన్ పూర్తయింది. జూన్ 21 వరకు రాష్ట్రంలో 3.29 లక్షల కొవిషీల్డ్ డోసులు, 2.09 లక్షల కొవాగ్జిన్ డోసులు కలుపుకొని మొత్తం 5.39 లక్షల డోసుల నిల్వ ఉన్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం నారాయణగూడలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్కేంద్రంలో 6,874 మంది వ్యాక్సిన్లు వేసుకున్నారు.
29నాటికి రాష్ర్టానికి వచ్చే వ్యాక్సిన్లు
కొవిషీల్డ్ 8.12 లక్షలు
కొవాగ్జిన్ 2.63 లక్షలు
మొత్తం 10.76 లక్షలు
వ్యాక్సిన్ వేసుకొన్నవారు
కొవిషీల్డ్ 75.42 లక్షలు
కొవాగ్జిన్ 17.49 లక్షలు
స్పుత్నిక్‌వీ 33,145
మొత్తం 93.25 లక్షలు
చిన్నారుల కోసం పడకలు
డీఎంఈ పరిధి దవాఖానల్లో 4,000
టీవీవీపీ-జిల్లా దవాఖానల్లో 1,400
టీవీవీపీ-ఏరియా దవాఖానల్లో 600
మొత్తం 6000