సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 00:54:40

రైతుల ఖాతాల్లోకి 6,886.19 కోట్లు

రైతుల ఖాతాల్లోకి 6,886.19 కోట్లు

  • దాదాపు పూర్తయిన రైతుబంధు నిధుల జమ 
  • సాయం అందనివారు ఏఈవోలను కలువాలి 
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు వేగంగా జమవుతున్నాయి. 48 గంటల్లోనే 54.21 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,886.19 కోట్లు జమచేసినట్టు అధికారులు తెలిపారు. తొలిరోజే రికార్డుస్థాయిలో 50.84 లక్షల మంది ఖాతాల్లో రూ.5,294.53 కోట్లు వేశారు. బ్యాంకు ఖాతానంబర్లు సరిగా లేకపోవడం, ఇతర సమస్యలతో మిగిలిన రైతులకు రైతుబంధు అందలేదు. ఈ సమస్యలను పరిష్కరించిన అధికారులు పెండింగ్‌లో ఉన్న రైతులకు బుధవారం నిధులు జమచేశారు. ఇప్పటివరకు రైతుబంధు పొందినవారిలో 74,084 మంది ఏజెన్సీల్లోని రైతులు కూడా ఉన్నారు. 

వీరి ఖాతాల్లో ప్రభుత్వం రూ.124.23 కోట్లు జమ చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు పాస్‌ పుస్తకాలు ఉన్న రైతులందరికీ రైతుబంధు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పాస్‌పుస్తకాలు ఉండి రైతుబంధు అందని రైతులు  స్థానిక ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. 16వ తేదీ తరువాత పాస్‌పుస్తకాలు వచ్చినవారు వ్యవసాయశాఖ కార్యాలయంలో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు పంట పెట్టుబడి అందిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రతి రైతుకు పంటసాయం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. కేసీఆర్‌ నిర్ణయాలతో రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.


logo