బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 04:58:59

జీఎస్టీ పరిహారానికి పోరాటం

జీఎస్టీ పరిహారానికి పోరాటం

  • కేంద్రం వద్దే 47 వేల కోట్ల జీఎస్టీ సెస్‌ 
  • చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి 
  • అన్ని పార్టీల ఎంపీలకు ఇచ్చేందుకు నోట్‌ తయారీ 
  • కలిసొచ్చే ఎంపీలతో ఐక్య పోరాటం

రాష్ర్టానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ఎంపీలు సిద్ధమయ్యారు. తెలంగాణకు నిధులు ఇవ్వడంలో చూపుతున్న నిర్లక్ష్యంపై పార్లమెంటు వేదికగా గళమెత్తనున్నారు. ఈ మేరకు ఎంపీలు జీఎస్టీ పరిహారంపై లెక్కలతో సహా వివరిస్తూ అన్ని పార్టీల ఎంపీలకు ఇచ్చేందుకు ఒక నోట్‌ను రూపొందించారు.  కలిసొచ్చే ఎంపీలతో ఐక్య పోరాటానికి నిర్ణయించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను రాబట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.. ఎంపీలతో సమావేశమై దిశానిర్దేశంచేశారు. దీని ఆధారంగాపూర్తిస్థాయిలో ప్రభుత్వం నుంచి లెక్కలు తెప్పించుకున్న ఎంపీలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఇవ్వాల్సిన, వచ్చిన నిధులపై అధ్యయనంచేశారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీఎస్టీ పరిహారంగా తెలంగాణ రాష్ర్టానికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రూ.6,116 కోట్లు చెల్లించాల్సిన కేంద్రం నయాపైసా ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో పూర్తిగా ఆదాయం కోల్పోయిన రాష్ర్టాలను ఆదుకోవాల్సిన కేంద్రం.. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ‘మీ డబ్బులు ఇవ్వలేం.. కానీ అప్పులు తెచ్చుకోండి’ అని ఉచిత సలహాలు ఇస్తున్నది. పైగా ఇప్పటివరకు తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపులకు తాత్కాలికంగా మారిటోరియం ఇవ్వాలని కోరినా స్పందించలేదు. రాష్ర్టాల నగదు కొరతను తీర్చడానికి హెలికాప్టర్‌ మనీ విధానం అమలుచేయాలని సూచించినా పట్టించుకోలేదు. అప్పుల కిస్తీల చెల్లింపులో ఊరట కలిగించే ప్రయత్నం చేయలేదు. చట్టప్రకారం ఇవ్వాల్సిన నిధులివ్వడంలేదు. 

ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో ఆదాయానికి గండి

ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు తీరని నష్టంచేకూర్చింది. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ చట్టం వల్ల రాష్ర్టాలకు చెందిన 47శాతం, కేంద్రానికి చెందిన 31శాతం ఆదాయం మాత్రం ఈ చట్టం పరిధిలోకి వచ్చింది. దీంతో రాష్ర్టాలు పెద్దఎత్తున నష్టపోయాయి. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు ఆదాయం తగ్గితే పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మొండిచేయి చూపుతున్నది. జీఎస్టీ మొదలైన తర్వాత 2017- 18లో మనకు వస్తున్న నిఖరమైన ఆదాయం కంటే అదనంగా జీఎస్టీ ద్వారా రూ.515 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఒక రెండు నెలల్లు సరిగా ఆదాయం లేకపోవడంతో ప్రొవిజనల్‌ కాంపన్సేషన్‌ కింద రూ.169 కోట్లు జీఎస్టీ పరిహారం ఇచ్చింది. 2018-19లో అదనంగా జీఎస్టీ ఆదా యం రూ.957 కోట్లు రావడంతో ఎ లాంటి పరిహారం చెల్లించలేదు. 2019- 20లో రూ.3,054 కోట్లు పరిహారం చెల్లించింది. ఈ పరిహారాన్ని సరైన సమయంలో ఇవ్వకుండా ఆలస్యంగా చెల్లించింది. ఆలస్యమైన చెల్లింపులపై జీఎస్టీ చట్టంలో వడ్డీ ఇవ్వాలని ఎలాంటి నియమంలేదని చెప్పి మిత్తి ఇవ్వలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నెలలవారీగా ఇవ్వాల్సిన పరిహారాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించింది. 4 నెలలు ఆలస్యంగా ఇచ్చింది.

జీఎస్టీ సెస్‌ 47 వేల కోట్లు స్వాహా

జీఎస్టీ పరిహారం చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం జీఎస్టీ అమలుచేయడం వల్ల నష్టపోయే రాష్ర్టాలకు 5 ఏండ్లపాటు పరిహారంచెల్లించడానికి నిర్దేశించిన వస్తువులు, సర్వీసులపై వచ్చే జీఎస్టీపై సెస్‌వేయాలని నిర్ణయించిం ది. ఈ సెస్‌ద్వారా వచ్చే ఆదాయాన్ని సెక్షన్‌ 10 ప్రకా రం సెస్‌తోపాటు జీఎస్టీ కౌన్సిల్‌ రికమండ్‌చేసే ఇతర ఆదాయాలను పబ్లిక్‌ అకౌంట్‌ ఆఫ్‌ ఇండియాలో భాగం గా జీఎస్టీ కాంపన్సేషన్‌ ఫండ్‌కు జమచేస్తారు. ఈ మొ త్తంనుంచి ఆదాయం నష్టపోయిన రాష్ర్టాలకు పంపిణీచేయాలి. పంపిణీచేయగా 5 ఏండ్ల తర్వాత మిగిలిన మొ త్తాలను సగం రాష్ర్టాలకు, మిగిలిన సగం కేంద్రానికి చెందిన కన్సాలిడేట్‌ ఆఫ్‌ ఇండియాకు పంపిణీచేయాలి. కానీ దీనికి విరుద్ధంగా కేంద్రం జీఎస్టీ సెస్‌ద్వారా వచ్చిన ఆదాయంలో మిగిలిన రూ.47,209 కోట్లు తన ఖాతాలో వేసుకున్నది.

అప్పులు తెచ్చుకోవాలని సలహా

జీఎస్టీ సెస్‌లో మిగిలిన రూ.47 వేల కోట్లు తన ఖాతాలో వేసుకున్న కేంద్రం.. రాష్ర్టాలను మాత్రం అప్పులు తెచ్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నది. జీఎస్టీ పరిహారం ఎంత చెల్లించాలో ఆ మేరకు రాష్ర్టాలు విడివిడిగా అప్పులు తెచ్చుకొని ఆ తర్వాత వాటిని తీర్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది. విడివిడిగా కాకపోతే రాష్ర్టాలు అన్నీ కలిసి ఆత్మనిర్భర్‌కింద రుణం తీసుకోవాలని చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్ల జీఎస్టీ పరిహారం కేంద్రం చెల్లించాలి. ఇందుకు భిన్నంగా రూ.65 వేలకోట్లే ఇస్తాం.. మిగిలిన రూ.2.35 లక్షల కోట్లు అప్పులు తెచ్చుకోవాలని ఆగస్టులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఉచితసలహా ఇచ్చారు. చట్ట ప్రకారం రాష్ర్టాలను అప్పు తెచ్చుకోవాలని చెప్పలేమని, విధిగా జీఎస్టీ పరిహారం చెల్లించాలని అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రానికి సలహా ఇచ్చింది. అయినా కేంద్రం ఏజీ సలహాను పక్కన పడేసింది.

రాష్ర్టానికి జీఎస్టీ పరిహారం చెల్లింపు ఇలా..

పరిహారం కాలం
ఇచ్చిన పరిహారం రూ.కోట్లలో
ఇచ్చిన తేదీ
ఏప్రిల్‌- మే 2019
175.00
29-07-2019
జూన్‌- జూలై 2019
700.00
30-08-2019
ఆగస్టు- సెప్టెంబర్‌ 2019 1,036.00
1,036.00
16-12-2019
అక్టోబర్‌- నవంబర్‌ 2019
352.16
17-02-2020
అక్టోబర్‌- నవంబర్‌ 2019
268.84
07-04-2020
జనవరి- ఫిబ్రవరి 2020
522.00
04-06-2020
మొత్తం
3,054


      


logo