Koppula Eshwar | కాంగ్రెస్ అంటేనే మోసం అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని అన్నారు. అసత్య ప్రచారంతో గద్దెనెక్కి.. ప్రజలను నిండా ముంచిందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నిర్వహించిన సభలో కొప్పుల మాట్లాడుతూ.. మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ర్టాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 24 గంటల కరెంట్, రైతుల సంక్షేమం, సాగు, తాగు నీటి ఇబ్బందులు లేకుండా, గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన సదుపాయాల కల్పన, కుల వృత్తులకు ఆదరణ కల్పించారని చెప్పారు. కానీ వాటన్నింటినీ కాంగ్రెస్ గాలికి వదిలేసినట్లు ఆరోపించారు. రైతు బంధు పూర్తిగా వేయలేదని, రుణ మాఫీ కోసం అనేక రకాలుగా సీఎం రేవంత్రెడ్డి మోసపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ను గెలిపిస్తేనే ప్రజల హక్కులకు భంగం కలుగకుండా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా అన్యాయం చేసిందనీ, అలాంటి పార్టీకి ఓట్లు వేయవద్దని కోరారు.