మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 01:35:33

తెలుగువాడిని నిలబెట్టుకున్నాం

తెలుగువాడిని నిలబెట్టుకున్నాం

  • రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపీలందరికి సమాన ప్రాధాన్యం కల్పించేవారు. పాలకపక్షం, ప్రతిపక్షం అనే వైరుధ్యాలు చూపేవారు కాదు. పార్లమెంటులో కూడా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలను సావధానంగా విని సమాధానాలిచ్చేవారు.

1991లో పీవీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతిచ్చారు?  ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న  శతజయంతి ఉత్సవాలపై మీ అభిప్రాయం ఏంటి?

పీవీ నరసింహారావు తెలుగువాడు, తెలంగాణవాడు కావడం వల్లే 1991లో మద్దతు ఇచ్చా. మన్మోహన్‌ వంటి ఆర్థికవేత్తను ఆర్థికమంత్రిగా నియమించి దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి, దేశ ఆర్థిక దశ,దిశను సమూలంగా మార్చిన గొప్ప సంస్కర్త. దేశం ఆర్థికపథంలో ముందుకు వెళ్లడానికి పీవీ, మన్మోహన్‌ సింగ్‌ కారకులు. సంపూర్ణ మెజారిటీ లేని కారణంగా పీవీ ప్రభుత్వం సంకటంలో పడ్డప్పుడు 1991లో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో, కేంద్రప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేనప్పుడు జార్ఖండ్‌కు చెందిన నలుగురు ఎంపీలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు టీడీపీ ఎంపీలం మద్దతు ఇచ్చాం. దీంతో ప్రభుత్వం నిలబడింది. మెజారిటీ లేకున్నా ఐదేళ్లు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. దేశాన్ని ప్రపంచీకరణకు అనుకూలంగా మార్చేందుకు పీవీ తీసుకొచ్చిన సంస్కరణలే ఇప్పుడు భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అలాంటి గొప్ప సంస్కర్త అయిన పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు  ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నిర్ణయించడం హర్షణీయం.

పీవీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు తోటి ఎంపీలతో ఎలా మెలిగేవారు?

ప్రధానమంత్రిగా పీవీ నర్సింహారావు ఎంపీలందరికి సమాన ప్రాధాన్యం కల్పించేవారు. పాలకపక్షం, ప్రతిపక్షం అనే వైరుధ్యాలు చూపేవారు కాదు. పార్లమెంటులో కూడా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలను సావధానంగా విని సమాధానాలిచ్చేవారు. పని ఎంత చిన్నదైనా.. పెద్దదైనా.. పీవీ దృష్టికి తీసుకెళ్లిందే తడవు.. ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తే.. కాదు, చేయను అనే అవకాశం ఉండేది కాదు. దేశానికి ప్రధానమంత్రి అయినా గ్రామాలు, నియోజకవర్గ అవసరాలు, అభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రం నుంచి ఢిల్లీకి విమాన సౌకర్యాలు పెరిగాయి. అప్పట్లో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే కేవలం ఉదయం ఒకటి, తిరిగి రావడానికి మరొక విమానం మాత్రమే ఉండేది. పీవీ ప్రధానమంత్రి అయ్యాక వీటి సంఖ్యను పెంచారు. పీవీ చొరవ కారణంగానే ప్రస్తుతం ఢిల్లీకి 30 విమానాలు వెళ్తున్నాయి. అధికార, ప్రతిపక్షం అనే వ్యత్యాసం చూపకుండా ఎంపీలకు అభివృద్ధి పనులను సమానంగా కేటాయించారు.

పీవీ మీపై చూపిన ప్రేమాభిమానాలు ఎలా ఉండేవి? ఆయనతో ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిది?

టీడీపీ ఎంపీనైనప్పటికీ కోరిన వెంటనే ప్రధానమంత్రి హోదాలో బాసర పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి విచ్చేయడం మరచిపోలేని విషయం. అనంతరం నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధానమంత్రి హోదాలో ఉన్న పీవీతో కలిసి వేదిక పంచుకోవడం రాజకీయ జీవితంలో గొప్ప అవకాశంగా భావిస్తాను. ప్రధానమంత్రి హోదాలో శ్రీరాంసాగర్‌ వరదకాల్వ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. బస్వాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీగా మాట్లాడే అవకాశం కల్పించారు. 1996 ఎన్నికల్లో నేను ఓడిపోయిన సమయంలో నాకంటే ఎక్కువగా పీవీ బాధపడ్డారు. ప్రజల కోసం పనిచేసే నీలాంటివాళ్లు ఎలా ఓడిపోయారని అడిగారు. బాబ్రీ మసీదు అల్లర్లు ప్రభావం చూపించి ఉంటాయి. లేకుంటే నీలాంటి పనిచేసే నాయకులను ప్రజలు ఓడించుకుంటారా? అని ధైర్యం చెప్పారు.

శాకాహారం అంటే ఏమిటి? 

విదేశాంగ వ్యవహారాల శాఖామంత్రి కానున్న పీవీ 1974లో ఖాళీ సమయం దొరకడంతో అమెరికాలో ఉండే తన కూతురు సరస్వతి దగ్గరికి వెళ్లారు. ఆమె ఉండేది న్యూయార్క్‌ నగరంలో. అమెరికా రాజకీయాలు చదువుతూ చూస్తూ మూడు మాసాలు గడిపేశారు. మధ్యమధ్యలో వీధుల్లో నడచివెళ్లటం ఒక హాబీగా చేసుకున్నారు. ఒకరోజు మేన్‌హాటన్‌ సిటీలో ఒక రెస్టారెంట్‌కు వెళ్లి శాకాహారం ఏదైనా ఉంటే కావాలని అడిగారు. వెయిటర్‌కు అర్థం కాలేదు. ఇంతకూ వెజిటేరియన్‌ అంటే ఏమిటి? అని వెయిటర్‌ ప్రశ్నించాడు. దాంతో అతడికి వెజిటేరియన్‌ అంటే ఏమిటో పీవీ వివరించాల్సి వచ్చింది. ఎలాంటి మాంసమూ కలవని ఆహారం శాకాహారం (వెజిటేరియన్‌) అని విడమర్చి చెప్పారు. అప్పటికి ఆ వెయిటర్‌కు అర్థమై.. మొక్కజొన్న గింజలు ప్లేటులో పెట్టి తీసుకొచ్చాడు! అమెరికా నుంచి తిరిగొచ్చాక ఈ సంఘటనను తన పిల్లలకు చెప్పి పడిపడి నవ్వుకున్నారు పీవీ. 

ప్రొఫెసర్‌ అయితే ఎంత బాగుండు 

పీవీ 1974లో మొదటిసారిగా అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌ దాటి ఆయన బయటకు వెళ్లిన నగరం మాడిసన్‌. అక్కడ విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పశ్చిమ అమెరికా మధ్యలో ఉండే ఈ విశ్వవిద్యాలయం భారతీయ విజ్ఞానం మీద అధ్యయనాలకు ప్రసిద్ధి. దక్షిణ భారతదేశపు ఆధునిక చరిత్ర మీద, తెలుగు సాహిత్యం మీద అథారిటీ అని చెప్పదగ్గ ప్రొఫెసర్‌ వెల్చేరు నారాయణరావు అక్కడ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నరసింహారావు విస్కాన్సిన్‌ సందర్శించిన నాటి విశేషాలను గుర్తుచేసుకుంటూ నారాయణరావు ఇలా అంటారు: ‘మేం చాలా సమయాన్ని సాహిత్యం మీద చర్చకే వెచ్చించాం. పీవీ సృజనాత్మకంగా ఆలోచించేవారు. ఆయనతో మాట్లాడిన కొద్దీ, ఆయన ఒక ప్రొఫెసర్‌గా బాగా రాణిస్తారు అని నాకు అనిపించేది. ఇక్కడ మా గ్రంథాలయంలో ఆయన్ని బాగా ఆకట్టుకున్న పుస్తకం రాఘవ పాండవీయం. ఆ పుస్తకంలో విశేషం ఏమిటంటే అవే పదాలు ఒక అర్థంలో రామాయణాన్ని, మరో అర్థంలో భారతాన్ని చెప్తాయి. అలా ద్వంద్వార్థం ఇచ్చే పదాల గురించి ఆయన చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయారు. ‘అసలు ఒకే పదం వేర్వేరు అర్థాలు ఇవ్వడం ఎంత విచిత్రం?’ అని ఆయన పరమానందభరితుడయ్యారు.

ఆ ఒక్కరోజు పార్టీ ధిక్కారం

పీవీ మరణించి ఇప్పటికి 16 ఏండ్లు గడుస్తున్నాయి. ఈ పుష్కరం పైచిలుకు కాలంలో ఆయన్ను కాంగ్రెస్‌ పూర్తిగా ఉపేక్షించింది. 

2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్‌ కేంద్రంలో, ఏపీలో అధికారంలో వుంది. అయినా ఆయన స్మృతిచిహ్నం ఏదీ ఏర్పాటుకాలేదు. ఎప్పుడూ ప్రభుత్వం ఆయన జయంతిని ఆధికారికంగా జరపలేదు. కేవలం పీవీ కుటుంబ సభ్యులు తమస్థాయిలో ఢిల్లీలో ఆయన జయంతిని జరుపుకోవడం, వాళ్ల మిత్రులు, పీవీని అభిమానించే పంజాబ్‌ నాయకుడు ఎంఎస్‌ బిట్టా వంటి కొద్దిమంది సహాయపడటం జరుగుతూ వచ్చింది. అయితే ఢిల్లీలో ఏటా జరిగే పీవీ జయంతికి తప్పకుండా హాజరవుతూ వచ్చిన కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు వున్నారు. ఆయనే మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌. తనను ఎన్నడూ ధిక్కరించడని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఈ ఆర్థికవేత్తను ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్‌ నేతలంతా ‘పీవీ వ్యతిరేక’ నియమాన్ని పాటిస్తుంటే మన్మోహన్‌ మాత్రం బాహాటంగానే ఉల్లంఘించారు. ఎందుకు? అంటే పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థికమంత్రిగా సంస్కరణలు అమలుచేయటంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏడాదికోసారి ఆ మహానుభావుడి జయంతిన పుష్పాంజలి సమర్పించడం చంద్రుడికో నూలుపోగు సమర్పించడం లాంటిది. ఆయన జ్ఞాపకాలకు నేనిచ్చే గౌరవం అది’ అంటారు మన్మోహన్‌ సింగ్‌.

నా పని నేను చేస్తున్నా.. మీ పని మీరు చేయండి

చదవడమో రాయడమో చేయకుండా ఉండడం పీవీ వల్ల కాదు. చివరికి ఆస్పత్రిలోనైనా. అమెరికాలోని హ్యూస్టన్‌లో ఆయనకు కరోనరీ బైపాస్‌ శస్త్రచికిత్స జరిగింది. చికిత్స తర్వాత రికవరీ గదికి తెచ్చారు. అన్నివైపులా గొట్టాలు బిగించి ఉన్నాయి. కదలడం, కూర్చోవడం కూడా కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మెల్లగా లేచి కూర్చుని స్థిమితంగా న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చదువుతున్నారు. అప్పడు డాక్టర్‌ వచ్చి ‘అయ్యా ఏం చేస్తున్నారు?’ అని అడిగారు. దానికి సమాధానంగా పీవీ ‘నా పని నేను చేస్తున్నాను. మీపని మీరు చేయండి’ అని సమాధానమిస్తే ఆ డాక్టరు అవాక్కయ్యారట.

సాహిత్య బంధం

సాహిత్యమంతా ఇక్కడే ఉంది! అన్నట్టు కన్పిస్తున్నది కదూ ఈ ఫొటో. ఒకానొక సందర్భంలో మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజపేయి, ప్రజాకవి కాళోజీ కలుసుకున్నప్పటి చిత్రం. 

పీవీ చేతిలో చెయ్యి వేసి వాజపేయి పలుకరిస్తుంటే, పక్కనే కూర్చొని ఉన్న కాళోజీ నవ్వులు చిందిస్తున్నారు.