 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తెలిపారు.
అత్యధికంగా వరి, పత్తి పంటలు నష్టపోయాయని చెప్పారు. వరి 2,82,379 ఎకరాల్లో, పత్తి 1,51,707 ఎకరాల్లో నష్టం జరిగిందని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని తుమ్మల తెలిపారు. ఎకరాకు ఎంత పరిహారం ఇవ్వాలన్నదానిపై సీఎంతో చర్చిస్తానని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పేర్కొన్నారు.

నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 30: మొంథా తుపాను రాష్ర్టాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం శ్రమను నీటిపాలు చేసి రైతుకు కన్నీళ్లు మిగిల్చింది. ఒక పక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తడిపి ముద్దచేసింది. పలుచోట్ల ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. ఇంకా కోయని చేళ్లను నేలరాల్చి అపార నష్టాన్ని తెచ్చింది. వంద కాదు.. రెండు వందలు కాదు వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మక్క పంటలకు నష్టం కలిగించింది. నోటికి వచ్చిన బుక్కను వరద ఎగరేసుకెళ్లడంతో ఎక్కడ చూసినా రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బుధవారం కురిసిన వర్షం, ఈదురుగాలుల కారణంగా పలు జిల్లాల్లోని చెరువులు, కుంటలు తెగి పంటలు కొట్టుకుపోయాయి.

చాలా చోట్ల పంట చేనుల్లో నీరు నిలిచి నష్టం వాటిల్లింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీగా పంట వరదపాలైంది. లక్షలాది ఎకరాల్లో పంట ఇంకా నీట మునిగే ఉన్నది. పొలాలన్నింటినీ వరద దున్నేసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే భారీ నష్టం వాటిల్లిందని అధికారిక లెక్కలతో స్పష్టమవుతున్నది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కల్లాల్లో, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. కోతకు వచ్చిన పైరు నేలవాలింది. మోర్తాడ్, కమ్మర్పల్లి, ధర్పల్లి, నవీపేట, మాక్లూర్, ఇందల్వాయి, డిచ్పల్లి, బాన్సువాడ తదితర మండలాల్లోని వరిపంట దెబ్బతినగా, ఇప్పటికే వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పంట కోసే సమయంలో నేలకొరగడంతో దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


హుజూరాబాద్ రూరల్ అక్టోబర్ 30 : వరద కారణంగా దెబ్బతిన్న తమ పంటలకు పరిహారం చెల్లించాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై బ్రిడ్జి వేయలేదని, దీంతో పెద్దచెరువు మత్తడి నుంచి భారీగా వచ్చిన వరదతో ఒక్కసారిగా రహదారి తెగి, సుమారు 150 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని వాపోయారు. హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
 
                            