 
                                                            బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్యకు దూరం కారాదనే లక్ష్యంతో రూపొందిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది. బకాయిల చెల్లింపులో రేవంత్ సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం, ఆపై కళాశాలల యాజమాన్యాల పట్ల దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరు ఇందుకు కారణం. బడుగుల విద్యాభివృద్ధి పట్ల సర్కారుకు, ముఖ్యంగా సీఎం రేవంత్‌కు గల అంకితభావాన్ని ఇది తెలియజేస్తున్నది. ఈ పథకం కాంగ్రెస్ హయాంలో రూపొందినప్పటికీ దీని వెనుకనున్న ఉద్దేశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి కొనసాగించడమే కాకుండా బకాయిలూ చెల్లించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారి మరో కాంగ్రెస్ సర్కారు హయాంలో పథకం ఆగమాగం అవుతున్నది.
రేవంత్ సర్కారు ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా బకాయిల ఊసెత్తడం లేదు. దీంతో బకాయిలు తడిసి మోపెడై రూ.10 వేల కోట్లు దాటిపోయాయి. నిర్వహణ కష్టం కావడంతో యాజమాన్యాలు ఆందోళన బాటపట్టగా, ప్రభుత్వం ఇటీవల రూ.1,207 కోట్లకు టోకెన్లు జారీచేసింది. కానీ, అందులో రూ.300 కోట్లు మాత్రమే విదిల్చింది. పిల్లల భవిష్యత్తును గాలికొదిలేసిన సర్కారు.. కళాశాలలపై బెదిరింపులకు దిగుతున్నది. తక్షణం కాలేజీలపై సీఐడీ, పోలీసుల సహాయంతో విజిలెన్స్ తనిఖీలు జరపాలని తాజాగా ఉత్తర్వులు జారీచేయడం ఎగవేత ధోరణి తప్ప మరోటి కాదు.
ఇది ఆర్థిక కోణంలో చూడాల్సిన అంశం కాదు. బకాయిల చెల్లింపులో ఊగిసలాట ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ చర్య వల్ల ఓవైపు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుండగా, మరోవైపు కళాశాలల్లో పనిచేసే వేలాది మంది సిబ్బంది బతుకులు అయోమయంలో పడుతున్నా యి. ప్రభుత్వమే అందరికీ విద్యను అందుబాటులోకి తేవడం సాధ్యం కాదు. ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే ఆ లోటు పూడ్చవచ్చనే ఆలోచనతో వచ్చిన ఈ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. సంపద పెంచడం, నలుగురికీ పంచడమనే కేసీఆర్ సూత్రాన్ని ఈ సర్కారు ఒంటబట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అందులో మొదటిది చేతకాదు, రెండోది సాధ్యపడదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించాలి. కానీ, ఢిల్లీకి మూటలు మోసే హడావుడిలో, ఎవరికి వారు దండుకునే సందడిలో ఆ సంగతిని పట్టించుకోవడం లేదు.
అరచేతిలో స్వర్గం చూపినట్టుగా తయారు చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగిస్తామని, అదనంగా రూ.5 లక్షల భరోసా కార్డులు ఇస్తామని ఊరించిన కాంగ్రెస్ ఇప్పుడు అసలుకే ఎసరు తెస్తున్నది. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి పరిపాలన చేతకాక చతికిలబడిన కాంగ్రెస్ సర్కారు అయితే బుకాయింపు, కాదంటే దబాయింపు అనే మార్గాన్ని ఎంచుకున్నది. నిలదీసినోళ్లను బెదిరిస్తు న్నది. ప్రశ్నలు వేస్తే, తప్పులను ఎత్తిచూపితే వేధింపులకు దిగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ నేతలపై, కార్యకర్తలపై కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. అధికారులపై విచారణలు, బదిలీల అస్త్రం ప్రయోగిస్తున్నది. పారిశ్రామికవేత్తలపై ఏకంగా తుపాకులే గురిపెడుతున్నది. ఇప్పుడు ఫీజు బకాయిల కోసం యాజమాన్యాలు గట్టిగా పట్టుబట్టితే విజిలెన్స్ బూచితో బెదిరిస్తున్నది. అటుచేసి, ఇటుచేసి బడుగుల చదువులను అటకెక్కించాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇది ఏ మాత్రం క్షంతవ్యం కాదు.
 
                            