రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాదు.. ఆ పార్టీ అధినాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయాయా? పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తాను సీఎంగా ఉంటానంటూ పదే పదే రేవంత్‌రెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్లీ గెలిచే పరిస్థితి లేదని నమ్ముతున్నదా? అవునని అంటున్నది ‘సౌత్ ఫస్ట్’ ఆన్లైన్ ఎడిషన్ తాజా కథనం. ఇటీవల తనను కలిసిన కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాసిన తాజా కథనం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్ఠానం ఆందోళనను తేటతెల్లం చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేకసార్లు లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తిగా, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్న. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం’.. ఈ వ్యాఖ్యలు చేసింది ప్రతిపక్ష పార్టీ నేతలో.. మరెవరో కాదు! స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడిన మాటలివి! రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేండ్లు కూడా గడవకముందే ప్రభుత్వం పతనం కావడం, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ మేరకు ‘సౌత్ ఫస్ట్’ ఆన్లైన్ పేపర్ మంగళవారం సంచలన కథనం ప్రచురించింది. ఇటీవల గుండెకు సంబంధించి చిన్న చికిత్స చేయించుకున్న మల్లికార్జున ఖర్గేను ఈ నెల 15న కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనర్సింహ, అసంతృప్త ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో కలిసి పరామర్శించారు. ఆ సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై ఖర్గేకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలపై సౌత్ పోస్ట్ సంచలన విషయాలను వెల్లడించింది.
రెండేండ్లు కాకుండానే ఇంత వ్యతిరేకతా?
ప్రతిపక్ష పార్టీలు పాలకవర్గాన్ని విమర్శించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ అధికార పార్టీకి చెందిన అత్యున్నత స్థాయి నాయకత్వం.. సొంత ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటే? అసహనం వ్యక్తం చేస్తే అది పెద్ద విశేషమే అవుతుంది. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు విషయంలో నిజమైంది. అసంతృప్త ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను తీవ్ర ఆవేదనకు గురిచేసినట్టుగా సౌత్ ఫస్ట్ కథనం పేర్కొన్నది.
తెలంగాణలో కాంగ్రెస్ రెండేళ్ల పాలన కూడా పూర్తి చేసుకోకముందే పతనం ప్రారంభంకావడం పట్ల ఖర్గే తీవ్ర ఆందోళన చెందుతునట్టుగా రాసింది. ఒక ప్రభుత్వం ఇంత తక్కువ పాలనా కాలంలో ఇంత దారుణంగా క్షీణించడం తాను ఎన్నడూ చూడలేదని పేర్కొనట్టు తెలిపింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కూడా కాకముందే ఇంత పతనం కావడం దారుణమైన అంశమని వాపోయినట్టు పేర్కొంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకున్నదని చెప్పినట్టుగా వెల్లడించింది. తక్కువ సమయంలో ప్రభుత్వ పనితీరుపై, పాలకులపై ప్రజలు ఈ స్థాయిలో వ్యతిరేకత పెంచుకోవడం అసాధారణ విషయమని ఆయన విస్తుపోయినట్టు తెలిపింది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఖర్గే అభిప్రాయపడినట్టుగా సౌత్ ఫస్ట్ పేర్కొన్నది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను కూడా ప్రస్తావించినట్టు తెలిపింది. వాస్తవానికి 2023 డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితితో పాటు ఆచరణ సాధ్యమైన పద్ధతితో కూడిన విధానాన్ని అవలంబించి ఉండాల్సిందని ఖర్గే అభిప్రాయపడినట్టు వెల్లడించింది. కానీ పార్టీ నేతలు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా ముందుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆయన పలు ఉదాహరణలు కూడా చెప్పినట్టుగా వెల్లడించింది. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీని కొర్రీలు, కోతలతో అరకొరగా అమలు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వివరించింది.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని కూడా సకాలంలో ఇవ్వకపోవడం, కోతలు పెడుతూ పూర్తిగా చెల్లించకపోవడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి సానుకూలంగా కంటే ప్రతికూలంగా మారిందని అన్నట్టుగా తెలిసింది. ఇక ఎన్నికల్లో మె జార్టీ ప్రభావం చూపే మహిళలకు, వృద్ధులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. మహిళలకు ప్రతి నెలా రూ.2500, వృద్ధులకు పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామనే హామీ నెరవేరలేదని వాపోయినట్టుగా తెలిసింది.
Mallikharjuna Kharge
ఒక ప్రభుత్వం ఇంత తక్కువ పాలనా కాలంలో ఇంత దారుణంగా క్షీణించడం నేను ఎన్నడూ చూడలేదు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కూడా కాకముందే ఇంత పతనం చెందడం దారుణమైన అంశం.
-రేవంత్ పాలనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే
సీఎం ఏక్షపక్ష వైఖరి పార్టీకి శాపం
మంత్రులను సమన్వయం చేసుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యాడని ఖర్గే పేర్కొన్నట్టు సౌత్ ఫస్ట్ తెలిపింది. మంత్రులతో చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసిందని అభిప్రాయపడినట్టుగా రాసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో ఆయన మరో కీలక వ్యాఖ్య చేసినట్టుగా పేర్కొన్నది. రేవంత్‌రెడ్డిని సీఎంగా ఎంపిక చేసి తప్పుచేశామని వ్యాఖ్యానించినట్టు రాసింది. రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం పార్టీకి తీవ్రనష్టం చేసినట్టుగా ఆయన అభిప్రాయపడినట్టు తెలిపింది. వాటాల కోసం మంత్రుల మధ్య కీచులాటలు, ఒకరినొకరు బహిరంగంగా తిట్టుకోవడం వంటి చర్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేశాయని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా పేర్కొన్నది. సీఎం, మంత్రుల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని పేర్కొన్నట్టుగా రాసింది.
బీసీ కోటా విషయంలో కాంగ్రెస్‌కు దెబ్బ తప్పదు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తమ పార్టీ, ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని, ఇది దీర్ఘకాలంలో కాంగ్రెస్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నదని ఖర్గే అభిప్రాయపడినట్టుగా కథనం పేర్కొన్నది. ఈ విషయంలో ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడానికి బదులు తమ పార్టీయే ఇరకాటంలో పడేలా చేసుకున్నారని మండిపడినట్టుగా రాసింది. సంవత్సరం క్రితమే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నా అన్ని పార్టీలను ఇందులో కలుపుకొని వెళ్లడంలో విఫలమైందని అన్నట్టుగా వివరించింది. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎప్పుడూ నిజాయతీగా లేదని ఆరోపించేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలిపింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్నదని చెప్పినట్టు పేర్కొన్నది. బీసీ రిజర్వేషన్ల సమస్య క్షేత్రస్థాయిలో సామాజిక-రాజకీయ సమీకరణాల్లో లోతైన మార్పులకు దారితీసిందని, ఇది దీర్ఘకాలంలో కాంగ్రెస్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసినట్టు వివరించింది.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రెడ్డీలు, దళితులు
దళితులు, శక్తిమంతమైన రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌కు మద్దతుదారులుగా ఉన్నారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో వారు గణనీయమైన పాత్ర పోషించారని ఖర్గే గుర్తు చేసినట్టు సౌత్ పోస్ట్ పేర్కొన్నది. అయితే రాహుల్ గాంధీ సూచన మేరకు బీసీలకు అధిక రిజర్వేషన్లు చేపట్టడం, దాన్ని అరుదైన నమూనా (రాహుల్-రేవంత్)గా చూపించడం ద్వారా వారిలో ఉన్న కొద్దిపాటి మద్దతును పార్టీ కోల్పోయిందని చెప్పినట్టుగా వివరించింది. ఇప్పటికే వెనుకబడిన వర్గాలు తప్పనిసరిగా బీఆర్ఎస్ లేదా బీజేపీకి మద్దతుదారులుగా ఉన్నారని, ఇలాంటి సందర్భంలో బీసీ రిజర్వేషన్ల చర్య ద్వారా కాంగ్రెస్ పార్టీ రెడ్డీలు, దళితులు పెద్ద సంఖ్యలో మద్దతుదారులను ఆగ్రహానికి గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేసినట్టుగా పేర్కొన్నది. ఇందుకు మంత్రులు, పార్టీ నాయకులు నియోజకవర్గాల పర్యటన సమయంలో వస్తున్న వ్యతిరేకతే ఉదాహరణ అని వివరించినట్టు రాసింది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వాస్తవానికి 2023 డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితితో పాటు ఆచరణ సాధ్యమైన పద్ధతితో కూడిన విధానాన్ని అవలంబించి ఉండాల్సింది. కానీ పార్టీ నేతలు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా ముందుకెళ్లారు.
– కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మళ్లీ అధికారం అసాధ్యం
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీలో అసంతృప్తులు, ప్రభుత్వంలో మంత్రుల మధ్య వాటా పంపకాల ఆరోపణలు, సీఎం రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, హామీలు అమలు చేయకపోవడం ఇలా అన్నిటినీ గమనిస్తే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఖర్గే వ్యాఖ్యానించినట్టు సౌత్ ఫస్ట్ వెల్లడించింది. ప్రజా జీవితంలో అపార అనుభవం ఉన్న వ్యక్తిగా, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేకసార్లు లోక్ సభకు ఎన్నికైన వ్యక్తిగా ఈ విషయం చెప్తున్నానని ఆయన స్పష్టం చేసినట్టు పేర్కొన్నది.
రేవంత్‌రెడ్డిని సీఎంగా ఎంపిక చేసి తప్పుచేశాం. రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం పార్టీకి తీవ్రనష్టం చేసింది. వాటాల కోసం మంత్రుల మధ్య కీచులాటలు, ఒకరినొకరు బహిరంగంగా తిట్టుకోవడం వంటి చర్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేశాయి. సీఎం, మంత్రుల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయి.
-కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ఖర్గే నిరాశకు కారణాలు నాలుగు!!