సిటీ బ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్యర్థులు, వారిని బలపరిచేందుకు వచ్చిన వారితో ఎన్నికల అధికారి కార్యాలయం ఆవరణ ఉదయం నుంచి అర్ధారాత్రి దాకా కిటకిటలాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి బలైన ప్రతి వర్గం నుంచి నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు.
ట్రిపుల్ఆర్, ఫార్మా సిటీ బాధిత రైతులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాల సంఘం, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఒక్కో వర్గం నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. వారందరినీ నిలువరించేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆర్వో కార్యాలయం పరిసరాల్లో భారీగా బారికేడ్లు పెట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్నికల అధికారి కార్యాలయం పరిసరాల్లో ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో చేసిన మోసం, నమ్మకద్రోహానికి నిరసనగానే నామినేషన్ వేస్తున్నట్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మోసాలు తెలియజేయాలనే తాము బరిలో నిస్తున్నామని తేల్చి చెప్తున్నారు.
తరలివచ్చిన నిరుద్యోగులు, ట్రిపుల్ఆర్, ఫార్మా సిటీ బాధితులు
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నామినేషన్ వేసేందుకు నిరుద్యోగులు, ట్రిపుల్ఆర్, ఫార్మా సిటీ బాధితులు వందలాదిగా తరలివచ్చారు. వీరితో పాటు మాల సంఘం, మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు తమకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలిచ్చి కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పునకు వ్యతిరేకంగా, ఫార్మాసిటీ భూబాధితులు రైతులు నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ చేస్తున్న మోసాలను తెలియజెప్పుతామని ప్రకటించారు.
కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేదాకా ప్రచారం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్తామని వెల్లడించారు. రైతులను మోసం చేసినందుకు ప్రతిఫలాన్నిస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణను అశాస్త్రీయంగా చేపట్టి మాలలకు కాంగ్రెస్ తీవ్రంగా అన్యాయం చేసిందని మాల సంఘాలు ఆరోపించాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తామని వారు తెలిపారు. మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఓట్లను పొంది తమకు తీరని అన్యాయం చేశారని మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు ఆరోపించారు. కేబినెట్లో మైనార్టీ వర్గానికి చెందిన మంత్రి లేకుండా తమకు రావాల్సిన నిధులను ఆపేశారని మండిపడ్డారు. మైనార్టీలకు చేసిన మోసానికి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టి బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు.
ఒక్కరోజే 188 మందికి టోకెన్లు..
నామినేషన్లు వేయడానికి కాంగ్రెస్ బాధితులు వందలాదిగా రావడంతో మంగళవారం ఒక్కరోజే 188 టోకెన్లు జారీ చేశారు. గత రెండు రోజులు సెలవు రోజులు కావడం, మంగళవారం ఒక్కరోజే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే ఆర్వో కార్యాలయం కిటకిటలాడటంతో రెండు దశలుగా మొత్తం 188 టోకెన్లు జారీ చేశారు. చిన్న చిన్న కారణాలతో అప్పటికే కొంతమందిని బయటకు పంపించినా 188 మందికి టోకెన్లు ఇచ్చారు. 18వ తేదీ వరకు మొత్తం 127 నామినేషన్లు దాఖలు కాగా ఆరోజే మరో 17 మందికి టోకెన్లు ఇచ్చి మంగళవారం రావాల్సిందిగా సూచించారు. తాజాగా టోకెన్లు ఇచ్చినవారితో పాటు ఆ 17 మంది కూడా రావడంతో కార్యాలయం ఆవరణ నిండిపోయింది. టోకెన్లు జారీ చేసిన వారందరి నామినేషన్లు స్వీకరించేందుకు చాలా ఎక్కువ సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు. టోకెన్లు ఇచ్చే ముందే చాలా వరకు అభ్యర్థులు ధ్రువపత్రాలు సరిచూశారు. దీంతో చాలా మంది సరైన పత్రాలు లేని వారిని అప్పటికే అనర్హులుగా ప్రకటించి బయటకు పంపించేశారు.
తిరస్కరణకు గురైన అభ్యర్థుల ఆందోళన
వివిధ కారణాలతో కొంతమంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లవని అధికారులు తిరస్కరించారు. ఎలాంటి కారణాలు లేకుండా తమ నామినేషన్ తిరస్కరించారని కొంతమంది అభ్యర్థులు ఆర్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నామినేషన్‌కు కావాల్సిన పత్రాలన్ని సరిగ్గా ఉన్నప్పటికీ కావాలనే తిరస్కరించారని ఆరోపించారు. అభ్యర్థుల సంఖ్యను తగ్గించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పత్రాలను తీసుకోకుండా బయటకు పంపించారని మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తన నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డకుని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. తాము బరిలో నిలబడితే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతారనే భయంతోనే రిటర్నింగ్ అధికారి ద్వారా నామినేషన్ తిరస్కరించేలా చేశారని విమర్శించారు. ఆందోళనకు దిగిన అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు.