హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి బతుకుల్లో వెలుగులు లేకుండా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మాదాపూర్‌లోని సున్నంచెరువు హైడ్రా కూల్చివేతల బాధితులు, బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్, హైదర్షాకోట్లో పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్‌రెడ్డి, హైడ్రా, మూసీ బాధితులతో కలిసి హరీశ్‌రావు దీపావళి పండుగ జరుపుకొన్నారు. బాధిత కుటుంబాలకు పటాకులు పంపిణీ చేసి అనంతరం వారి పిల్లలతో కలిసి కాల్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలనను నరకాసురుడితో పోల్చారు. రేవంత్‌రెడ్డి నరకాసురుడిలా ఈ రాష్ర్టానికి దాపురించాడని, ఆ పీడ విరగడైనప్పుడే తెలంగాణకు నిజమైన దీపావళి అని పేర్కొన్నారు. మరో రెండేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, బాధితులకు అప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. సున్నంచెరువు వద్ద ఏండ్లుగా ఉంటున్న పేదల ఇండ్లపైకి హైడ్రా బుల్డోజర్లను పంపి అన్యాయంగా వారి కడుపుకొట్టి, కట్టుబట్టలతో వారిని బయటకు పంపి ఇండ్లను కూల్చారని ఆవేదన వ్యక్తంచేశారు. హైడ్రా కూల్చివేతలతో నగరంలోని చాలా ప్రాంతాల్లో పేదలు గూడు చెదిరిన పక్షుల్లా అయ్యారని పేర్కొన్నారు. కనీసం పిల్లల పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా ఇండ్లు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని మండిపడ్డారు. కేసీఆర్ కట్టించిన లక్ష ఇండ్లలో ఇంకా 40 వేలు మిగిలి ఉన్నాయని, వాటిని కూల్చివేతల బాధితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చివేత
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కట్టించి ఇస్తారనుకున్నామని, కానీ ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టే కార్యక్రమమని అనుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రేవంత్ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క ఇటుక పేర్చింది లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో పేదలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిని సరఫరా చేస్తే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నల్లా నీళ్లు రావడం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చి అందరిని ఆగం చేసిందని, ఓ వైపు రియల్ ఎస్టేట్ ఆగం, మరో వైపు వ్యాపారం చేసుకునే వాళ్లు, ఆటో నడుపుకొనే వాళ్లు ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
సున్నం చెరువుతోపాటు హైడ్రా వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి పేరు, అడ్రస్, ఫోన్ నంబర్లు ఉన్నాయని, అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నరకాసుర ప్రభుత్వం పోయాక దీపావళి పెద్దగా జరుపుకుందామని, పేదల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. పేదలకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని, హైడ్రా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసుద్దీన్, హైదర్‌నగర్ కార్పొరేటర్ రోజాదేవి రంగారావు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.