మోర్తాడ్, మార్చి 9: మండలంలోని ఇసుక దందాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అధికార పార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి ఇసుక దోపిడీ మళ్లీ షురువయ్యింది. అర్ధరాత్రి వాగులోకి వెళ్లడం పొక్లెయిన్‌తో తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. వారం రోజులుగా యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా, అధికారులు తమకేమీపట్టునట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.రాత్రి నుంచి తెల్లవారు వరకు జాతీయరహదారిపైనే ఇసుక ట్రాక్టర్లు రయ్ రయ్‌మంటూ వెళ్తున్నా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో మాదిరిగా అధికార పార్టీ నాయకులే తిరిగి మరోసారి ఇసుక దోపిడీకి సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. అందుకే అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పది రోజులకు ట్రాక్టర్‌కు రూ.50వేలు
ప్రస్తుతం ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే విధానం తీసుకురావడం. ఇప్పటి వరకు ఇసుక రీచ్‌లు అధికారికంగా ప్రారంభం కాకపోవడంతో ఇసుకకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో గిరాకీతోపాటు ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో అంది వచ్చిన అవకాశంగా భావించిన అధికార పార్టీకి చెందిననాయకులు గాండ్లపేట్ గ్రామకమిటీతో పదిరోజులకు ట్రాక్టర్‌కు రూ.50వేలు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. రాత్రి నుంచి తెల్లవారు వరకు వాగు నుంచి ఇసుకను తరలించే అవకాశం ఉంటుంది. దీంతో రాత్రి నుంచి తెల్లవారే వరకు ప్రతిరోజు గాండ్లపేట్ పెద్దవాగు నుంచి పెద్దమొత్తంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తున్నవారు ట్రాక్టర్‌కు సుమారు రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇసుక దందా జోరుగా సాగుతుండడంతో గాండ్లపేట్తోపాటు మోర్తాడ్ శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. వారం రోజులుగా ఇసుక అక్రమ తరలింపుపై సమాచారం మోర్తాడ్తో పాటు కమ్మర్పల్లి, చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసినా అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.

‘మన ఇసుక-మన వాహనం’ పరిస్థితి ఏమిటి?
ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ‘మన ఇసుక -మన వాహనం’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ఇసుక అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత కార్యదర్శికి సమాచారం వెళ్తుంది. దరఖాస్తుకు సంబంధించి పరిశీలన చేసి కార్యదర్శి ఓకే చెబితే సంబంధిత తహసీల్దార్‌కు దరఖాస్తు వెళ్తుంది. అక్కడి నుంచి ఇసుకరీచ్‌కు వెళ్లడం అక్కడి నుంచి ఇసుక తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధానం ప్రస్తుతం ఇక్కడ అమలుకావడంలేదు. దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారు.కానీ ఈ విధానంలో ఎవరికి ఇప్పటి వరకు ఇసుక రాలేదు. దీంతో ఇండ్లు ఇతర నిర్మాణాలు చేపడుతున్న వారికి ఇసుక అత్యవసరంగా మారింది. ఇదే అదునుగా భావించి పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను నివారించడానికే ఇసుక వాహనం విధానాన్ని తీసుకువచ్చామని చెబుతుంటే, మరోవైపు అధికారపార్టీ నాయకులే ఇసుక అక్రమ రవాణాకు తెరలేపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైల్వేబ్రిడ్జి వద్ద కూడా తవ్వకాలు
గాండ్లపేట్ పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారు వాగులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో నుంచి తవ్వకాలు చేపట్టడంతో అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో బ్రిడ్జికి ప్రమాదకంగా మారే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దవాగులోని బ్రిడ్జి వద్ద ఇసుక తవ్వకాలు చేపట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, ఇసుకవాహనం ద్వారా ప్రజలకు ఇసుకను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న ప్రజలు కోరుతున్నారు.
ఇసుక తరలింపు దృష్టికి రాలేదు
గాండ్లపేట్ నుంచి రాత్రుల్లో ఇసుకను అక్రమంగా తరలి స్తున్నా రనే విషయం మా దృష్టికి రాలేదు. మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇసుక వాహనం ద్వారా ఇసుక కోసం దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తు దారులకు ఇసుకను ఇచ్చేందుకు పాలెం, సుంకెట్ రీచ్‌లను పరిశీలిస్తున్నాం. త్వరలో ఎంపీడీవో, ఎస్సైతో కలిసి రీచ్‌లను సందర్శిస్తాం.
– కృష్ణ, తహసీల్దార్,మోర్తాడ్
