శేరిలింగంపల్లి, అక్టోబర్ 21: రేవంత్ సర్కార్‌కు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ పేదలకు అందించే వైద్యసేవలపై లేదని నగరంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి బస్తీ దవాఖానను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానల్లో అందుబాటులో ఉన్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యం కోసం వచ్చే రోగులతో ఆయన మాట్లాడారు. దవాఖానలో వైద్యసేవలు పొందుతున్న వారితో పాటు వైద్యసేవలు అందించే డాక్టర్, నర్సు, కిందిస్ధాయి సిబ్బందితో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు. బీపీ గోలీలు సైతం ఇవ్వడం లేదని కొందరు, సాధారణ వైద్యసేవల కోసం సైతం నిత్యం దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తోందని మరికొందరు రోగులు హరీశ్‌రావుతో వాపోయారు.
ఇక జీతాలు సరిగ్గా అందుతున్నాయా అని బస్తీ దవాఖానలో వైద్య సేవలు అందిస్తున్న డ్యూటి డాక్టర్‌తో పాటు నర్సు, సపోర్టింగ్ నర్సు, కిందిస్థాయి సిబ్బందిని ఆరాతీయగా తమకు 3 నుంచి 6 నెలలుగా జీతాలు రావడం లేదని వారు అవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన బస్తీ దవాఖానలు పేద ప్రజల రోగాలను నయం చేసేవిధంగా బాగా పని చేశారన్నారు. రేవంత్ రెడ్డిని కోరేది ఒక్కటే బస్తీ దవాఖానలను పట్టించుకో.. వీటిపై రివ్యూ చేయి…కేసీఆర్ కిట్లను అందజేయాలని కోరారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మారబోయిన రవియాదవ్, సీనియర్ నాయకులు రంగారావు, పురుషోత్తం యాదవ్, కృష్ణయాదవ్, వాలా హరీశ్‌రావు, తిరుమల్లేశ్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
షేక్‌పేట్:జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్లోని బస్తీ దవాఖానను మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్,నంది కంటి శ్రీధర్, డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్,నాయకులు చెరక మహేశ్‌లతో కలిసి సందర్శించారు. ప్రజారోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.
మూసాపేట: మూసాపేట డివిజన్ పరిధి జనతానగర్‌లోని బస్తీ దవాఖానను కార్పొరేటర్ శీరిషాబాబురావు, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్‌కుమార్, బాబురావులతో కలసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. బస్తీ దవాఖానలో సదుపాయాలను పరిశీలించారు.
అమీర్‌పేట్: పేదలకు సత్వం వైద్యం అందాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్ బస్తీ దవాఖానను పల్లా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్లతో కలిసి సందర్శించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ షరీఫ్ ఖురేషీ, నజీమ్ తదితరులున్నారు.
జూబ్లీహిల్స్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రహణం పట్టిందని.. బస్తీ దవాఖానలలో ఇప్పటికీ కేసీఆర్ హయాంలో ఇచ్చిన మందులే వాడుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్‌తో కలిసి మంగళవారం యూసుఫ్‌గూడలోని బస్తీ దవాఖానను సందర్శించారు. రోగులకు ఇచ్చే మందులకు ఎక్సైరీ డేట్ వస్తున్న ముందులను రోగులకు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంగళరావునగర్: పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ లోని జవహర్ నగర్ బస్తీ దవాఖానాను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన సందర్శించారు. డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ..పేద రోగుల సమస్యల్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.
అల్లాపూర్: ప్రభుత్వ ప్రాథమిక వైద్యారోగ్యకేంద్రాల తో పాటు,బస్తీ దవాఖానల్లో సమస్యలు తిష్ట వేశాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు మంగళవారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్‌నగర్ ప్రభుత్వ దవాఖానను కార్పొరేటర్‌తో కలిసి పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ అడిగి తెలుసుకున్నారు.